నోట్ల రద్దు సమయంలో కొత్త 2,000 నోట్లతో దొరికిన చెన్నైకు చెందిన శేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద రాజకీయం దుమారమే రేపారు. ఆయన టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉండటంతో లోకేష్ బినామీ అని ఆ డబ్బు చంద్రబాబుదే అని వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీలు ఆరోపించాయి. ఆరోపణలతో ఆయన్ను బోర్డు నుండి తప్పించింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.
అయితే అధికారంలోకి రాగానే అదే శేఖర్ రెడ్డికి మళ్ళీ పదవి ఇచ్చింది జగన్ ప్రభుత్వం. తాజాగా ఆయనకు ఇప్పుడు ఆ కేసు నుండి క్లీన్ చిట్ వచ్చింది. శేఖర్ రెడ్డి పై నమోదు చేసిన అవినీతి కేసును చెన్నై సిబిఐ కోర్టు కొట్టివేసింది. ఆయన అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లభించలేదని కోర్టు తీర్పు ఇచ్చింది.
2016లో చెన్నైలోని శేఖర్ రెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 12 లక్షల పాత కరెన్సీ తో పాటుగా భారీగా కోట్లాది రూపాయల కొత్త కరెన్సీ నోట్లు, వందల కిలోల బంగారం లభించింది. దీంతో ఆయనపై కేసు నమోదైంది.శేఖర్ రెడ్డి పై అవినీతి నిరోధక చట్టం 1988 లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.
ఆధారాలు కేసుల సంగతి పక్కన పెడితే తమ సొంత ఖర్చుల కోసం సొంత అకౌంట్ నుండి డబ్బులు తీసుకోవడానికి గంటల తరబడి లైన్ లో నుంచున్న ప్రజలు శేఖర్ రెడ్డికి మాత్రం అదే సమయంలో అంత పెద్ద మొత్తంలో కొత్త నోట్లు ఎలా వచ్చాయి అనేది మాత్రం అంతు చిక్కని ప్రశ్న.




