ప్రస్తుతమంటే ముంబై ఇండియన్స్ ఏదొక వివాదం కారణంగా వార్తల్లో ఉంటుంది గాని ఒక ఆరేడేళ్లు వెనక్కి వెళ్తే అయితే ప్లే-ఆఫ్స్ కు వెళ్ళటమో లేదా ట్రోఫీ దక్కించుకోటమో, వీటిలో ఏదో ఒక కారణాన వార్తలకెక్కేది. 2020 లో జరిగిన 13వ ఐపీఎల్ సీజన్ లో చివరిగా ట్రోఫీను ముద్ధాడిన ముంబై, అప్పటినుండి ట్రోఫీను మరలా ముట్టలేదు.
సచిన్ టెండుల్కర్, రిక్కీ పాంటింగ్, హర్భజన్ సింగ్ వంటి లెజెండరీ ఆటగాళ్లు తొలుత ముంబై కు కెప్టెన్సీ పగ్గాలను అందుకున్నప్పటికీ, ఒక్కసారి కూడా ఆ జట్టును ఫైనల్స్ కు పట్టుకెళ్లలేకపోయారు వారు. అప్పుడు 2013 లో తొలిసారి 26 ఏళ్ళ రోహిత్ శర్మ కు సారధి పగ్గాలను అందించారు ముంబై ఫ్రాంచైజ్ యాజమాన్యం.
అయితే, రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు బులెట్ ట్రైన్ వలె దూసుకెళిపోయింది. 2013 నాటికే 2-టైం ఛాంపియన్స్ గా నిలిచారు చెన్నై ఫ్రాంచైజ్. 2013 లో ట్రోఫీ వేట మొదలు పెట్టిన ముంబై, 2020 నాటికి ఏకంగా 5 ట్రోఫీలు అందుకుని, కలలో కూడా ఊహించని విధంగా ఫామ్ చెలాయించింది ఆ జట్టు.
గడిచిన 8 సీజన్లలో 5 సార్లు ప్లే-ఆఫ్స్ కు అర్హత సాధిస్తేనే ఆ జట్టు ఫామ్ బావుందని అనుకుంటారు అభిమానులు. అలాంటిది శర్మ నేతృత్వంలో ముంబై జట్టు 8 సీజన్లలో 5 కప్పులను ఎగరేసుకుపోయింది. 2019,2020 సీజన్ల ట్రోఫీలు వరుసగా అందుకుని, బ్యాక్-టు-బ్యాక్ ట్రోఫీస్ అందుకున్న రెండవ ఫ్రాంచైజ్ గా నిలిచారు ముంబై.
కానీ, దుబాయ్ వేదికగా జరిగిన ఆ 2020 ఐపీఎల్ తరువాత నుండి ముంబై జట్టు మళ్ళీ అంత సాలిడ్ పర్ఫామెన్స్ ఇవ్వడంలో విఫలమైందనే చెప్పవచ్చు. జట్టు పరంగా గత 2 ఏళ్లగా ముంబై కు అద్భుతమైన జట్టు ఉన్నప్పటికీ, 2024లో అంతర్గత విబేధాల వల్ల ఆ జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది.
రోహిత్ ను కెప్టెన్సీ పగ్గాలనుండి నిష్క్రమించి, ఆ పగ్గాలను హార్దిక్ కు ఇవ్వటం అభిమానులకే నచ్చలేదు. ఇక, హార్దిక్ ను ముంబై హోమ్-గ్రౌండ్ లో నే మోక్ చేస్తూ, ఆ ఏడాది ఐపీఎల్ హార్దిక్ కు ఒక నైట్-మెర్ వలె చేశారు సొంత అభిమానులు. కానీ, ఆ ఏడాది టి-20 వరల్డ్ కప్ విజయంలో హార్దిక్ చూపిన పోరాట-పటిమ కు అదే ఫాన్స్ తనను భుజాన ఎత్తుకున్నంత పని చేసారు.
ఇలా, జట్టులోని అంతర్గత వివాదాలు 2024 లో నే ఒక కొలిక్కి రాగా, 2025 లో ఆ జట్టు క్వాలిఫయర్-2 వరుకు వచ్చి, ఫైనల్స్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచారు. ఈసారి ముంబై స్క్వాడ్ ను చూస్తుంటే ఆరేళ్ళ నుండి ఊరిస్తున్న ఆ 6వ ట్రోఫీ కొట్టేలానే కనిపిస్తున్నారు. మరి ఈసారి ముంబై ట్రోఫీని నెగ్గుతుందని మీరు అనుకుంటున్నారా..?






