రాజకీయాలకు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు మధ్య చాలా సన్నటి గీత ఉంటుంది. ప్రభుత్వాలను నడిపేవి రాజకీయ పార్టీలే కనుక వాటి రాజకీయ ఆలోచనలు, వ్యూహాలకు అనుగుణంగా వారిని ఉపయోగించుకుంటాయి. కనుక రాజకీయాలతో సంబంధం లేకుండా పనిచేయాల్సిన అధికారులు, రాజకీయ ఒత్తిళ్ళ మధ్య పనిచేయాల్సి వస్తుంది.
కొందరు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పని చేస్తే, మరి కొందరు కులం, మతం, రాజకీయ ఆసక్తితో అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు.
రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి లేదా అత్యుత్సాహం ప్రదర్శించిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రభుత్వాలు మారగానే బలిపశువులుగా మారుతుంటారు.
అయితే వారిని వాడుకున్న రాజకీయ పార్టీలు, మాజీ సిఎంలు, మంత్రులు వారికి అండగా నిలబడరు. కానీ ఆ సమస్యలలో తాము చిక్కుకోకుండా రాజకీయ నాయకులు చాలా సులువుగా తప్పించుకుంటారు.
ఈ విషయం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు బాగా తెలుసు. అయినా వారు ఈ రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకుపోయి, అత్యంత అవమానకరంగా పదవీ విరమణ చేస్తున్నారు.
ఇందుకు తాజా ఉదాహరణగా, ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1996 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీపీ ఎన్. సంజయ్ కళ్ళ ముందే ఉన్నారు.
అగ్నిమాపక, సీఐడీ శాఖలలో ఉన్నతస్థాయి పదవులు చేపట్టిన అయన, ఆయా విభాగాల నిధుల పక్కదారి పట్టించడం లేదా దుర్వినియోగం చేసినందుకు కూటమి ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన పదవీ కాలం 2027, మార్చి 31వరకు ఉంది.
అప్పటి వరకు లేదా ఆయనపై నమోదు చేసిన క్రిమినల్ కేసుల విచారణ ముగిసేవరకు, రెండింటిలో ఏది ముందైతే అంతవరకు సస్పెన్షన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నేటికీ దేశంలో లక్షలాది మంది యువత ఐఏఎస్, ఐపీఎస్ అధికారి అవ్వాలని పట్టుదలగా కృషి చేస్తుంటారు. కానీ వారిలో ఏ కొద్దిమందో అవి సాధించగలుగుతారు.
అంత కఠినమైన పరీక్షలు, శిక్షణ కోసం రేయింబవళ్ళు శ్రమించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ప్రభుత్వంలో ఉద్యోగాలు చేపట్టినప్పుడు వారి పనితీరు, జీవితం యువతకు స్ఫూర్తిదాయకం గా ఉండాలి. కుటుంబ సభ్యులకు గర్వకారణంగా నిలవాలి. అలాగే వారి పదవీ విరమణ, తదనంతర జీవితం కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా, ప్రశాంతంగా ఉండాలి.
కానీ ఈ విధంగా అత్యంత అవమానకరంగా పదవీ విరమణ చేయాల్సి వస్తోంది. ఆ తర్వాత కూడా వారు ప్రశాంతంగా జీవించే అవకాశం లేకుండా వారిని కేసులు వెంటాడుతూనే ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెంటినీ నడిపేవి రాజకీయ పార్టీలే కనుక వారి ఈ సమస్యకు అవి పరిష్కారం చూపకపోవచ్చు. కనుక ఈ రాజకీయ ఊబిలో చిక్కుకోకుండా ఏవిధంగా పని చేయాలని వారే ఆలోచించుకోవాలి.







