పాన్ ఇండియా మోజులో ఏం కోల్పోతున్నాం?

Is the Pan-India Obsession Damaging Telugu Cinema’s Roots?

ఇప్పుడు పెద్ద సినిమా అంటే పాన్ ఇండియా అయ్యుండాలి. ఐదు భాషల్లో తీయాలి గాబట్టి ఆయా రాష్ట్రాల హీరోలను పెట్టి చూపించాలి.

అవసరం ఉన్నా లేకున్నా గ్రాఫిక్స్, విదేశాలలో పాటలు, ఫైట్స్ తప్పనిసరి. అలాగే ఆ నాలుగైదు భాషలని మిక్సీలో వేసి తిప్పి పాటలు రాయడం తాజా ట్రెండ్. ఆ పాట వినబడకుండా హోరెత్తించే మ్యూజిక్ తప్పనిసరి.

ADVERTISEMENT

ఇలా చెప్పుకుంటూపోతే ‘పాన్ ఇండియా’ లేబిల్ కోసం చాలా హంగులు జోడించాల్సి ఉంటుంది. వాటన్నిటితో నేటివిటీ కనపడకుండా పోతుంది.

ఒకవేళ కాస్త మిగిలి ఉంటే, ఉత్తరాది రాష్ట్రాలలో అదే మైనస్‌గా మారుతుంది. ‘దీనిలో మనోడు ఉన్నాడు కానీ ఇది మన సినిమా కాదు మద్రాసీ డబ్బింగ్ సినిమా,’ అని ఉత్తరాది ప్రేక్షకులు తేల్చిపడేస్తారు.

ఉత్తరాదిలో నేటివిటీ కనపడటం వలన దెబ్బ తింటే, దక్షిణాది రాష్ట్రాలలో నేటివిటీ సరిపోక తిరస్కరణకు గురవుతుంటాయి.

అలా రిజక్ట్ అయిన సినిమాల గురించి అందరికీ తెలుసు. కనుక వాటి పేర్లు అనవసరం. ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా తెలుగు నేటివిటీతో తీస్తే అది హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. కానీ పాన్ ఇండియా మోజులో పడి సినిమాని సంకరం చేసుకొంటే రెంటికీ చెడిన రేవడిగా మారుతుంది.

పాన్ ఇండియాతో ఒక దెబ్బకు 5 పిట్టలు కొట్టాలని ప్రయత్నిస్తే ప్రతీసారి 5 పిట్టలు పడకపోవచ్చు. కానీ చాలాసార్లు 5 పెద్ద ఎదురు దెబ్బలు తప్పక తగులుతుంటాయి. ఆ దెబ్బల నుంచి కోలుకోవడం చాలా కష్టం.

పైగా దక్షిణాది నుంచి పాన్ ఇండియా సినిమా అంటే ఉత్తరాది డిస్ట్రిబ్యూటర్లు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క పాన్ ఇండియా సినిమా ఫ్లాప్ అయితే చాలు దక్షిణాది సినిమాలు గాలి బుడగ వంటివే అని తేల్చి పడేస్తారు కూడా.

ఇక హీరోలు పాన్ ఇండియా మోజులో పడి అభిమానులకు దూరమైతే, వారి పునాదులు వారే కూల్చేసుకొని దానిపై హైరైజ్ బిల్డింగ్ కట్టుకున్నట్లే అవుతుందని మరిచిపోకూడదు.

అలాగని ప్రతీ పాన్ ఇండియా సినిమా బెడిసి కొడుతుందని కాదు. దేశంలో అన్ని రాష్ట్రాలు, ప్రజలు, భాషలతో కనెక్ట్ కాగల కధ, పాత్రలతో తీస్తే అలరించవచ్చని ‘ది గర్ల్ ఫ్రెండ్’ నిరూపించింది.

తమిళ్, మలయాళ సినిమాలలో నేటివిటీ వదులుకోరు. ముఖ్యంగా మలయాళ సినిమాలు అసలే వదులుకోవు. అయినప్పటికీ వాటిని ఇతర రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. అంటే ఏ సినిమాకైనా ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వాలంటే నేటివిటీ చాలా ముఖ్యమని తమిళ, మళయాళ సినిమాలు, మన చిన్న సినిమాలు నిరూపిస్తున్నాయి కదా?

కనుక పాన్ ఇండియా స్థాయికి పెరిగామని జబ్బలు చరుచుకోవడం అంత మంచిది కాదు. అదే మన కొంప ముంచుతోందని గ్రహిస్తే మంచిది. ఆ మోజులో పడి మనం ఏమేమి వదిలేసుకుంటున్నామో, ఏమేమి కోల్పోతున్నామో ప్రతీ హీరో, దర్శక నిర్మాతలు ఆలోచించుకుంటే మంచిది.

ADVERTISEMENT
Latest Stories