రాజకీయ విపత్తులు అనేది ఏదోక సమయంలో, సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలకు, ఆయా పార్టీల అధినేతలకు ఎదురవుతూనే ఉంటాయి. అయితే అవి ఒక్కోసారి ఒక్కో సందర్భాన్ని బట్టి ఒక్కో రూపం దరిస్తాయి.
అయితే ఒక సారి ప్రజల నుంచి వచ్చే తీర్పు మాదిరి ఓటమి రూపంలో ఎదురైతే మరోసారి ప్రత్యర్థి పార్టీల రాజకీయ వ్యూహాలలో భాగంగా సంక్షోభం రూపంలో పలకరిస్తుంది. మరోసారి పార్టీని నమ్ముకున్న నాయకులే అధికారం అనే వ్యాపారి వద్ద ఆ నమ్మకాన్ని తాకట్టు పెట్టి పార్టీని నట్టేట ముంచుతారు.
అయితే విపత్తు ఏ రూపంలో ఎదురైనా నాయకుడనే వాడు తన నిబద్దతతో, దృఢ సంకల్పం తో పార్టీని ముందుకు తీసుకెళ్లగల్గాలి, ఓటమి అనే నిరాశ నుంచి గెలుపు అనే ఆశను చూపించగలగాలి. అయితే ఇప్పుడు ఆ నిబద్దత, దృఢ సంకల్పం కేసీఆర్ లో కానరావడం లేదనే భావన ప్రతి గులాబీ కారు మద్దతుదారుని మదిని తొలిచేస్తోంది.
2019 నుంచి 2024 వరకు టీడీపీ ఆ ఐదేళ్లలో ఎన్నడూ చూడని రాజకీయ విపత్తుని ఎదుర్కొంది. పార్టీ క్యాడర్ సైతం పసుపు జెండా పట్టేందుకు భయపడిన సందర్భాలు, వైసీపీ నేతలు బెదిరించిన దృశ్యాలు మీడియాలో కోకొల్లలుగా దర్శనమిచ్చాయి.
అలాగే బాబు తో పాటు రాజకీయాలకు దూరంగా ఉండే ఆయన కుటుంబంలోని మహిళలను సైతం అవమానించేలా, వారి ఆత్మ గౌరవం కించపరిచేలా అసెంబ్లీ నుంచి సోషల్ మీడియా వరకు వైసీపీ కాలకేయ సైన్యం చేసిన నీచ రాజకీయం ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎన్నడూ చూడలేదు, వినలేదు.
ఇక ఏకంగా బాబు అరెస్టు అంటూ టీడీపీ పార్టీలో అతి పెద్ద రాజకీయ సంక్షోభాన్ని సృష్టించి వైసీపీ గాలికి గులాబీ కారుకి సైకిల్ తలవంచాల్సిందే అన్నట్టుగా నాడు ఇరు పార్టీల నేతలు సాగించిన రాజకీయాన్ని, ఆ రాజకీయ సంక్షోభాన్ని తట్టుకుని నిలబడి తిరిగి ఏపీలో టీడీపీ ని అందలం ఎక్కించింది పసుపు సైకిల్.
కానీ కారు సైకిల్ కన్నా బలమైనది, బరువైనది అంటూ చెప్పుకొచ్చిన బిఆర్ఎస్ ఒక్క కూటమికే కుంగిపోయింది, ప్రజా క్షేత్రంలోకి ప్రయాణించలేని నిస్సహాయ పరిస్థితిలో పడిపోయింది. అలాగే సొంత కుటుంబ సభ్యుల నుంచే అవినీతి ఆరోపణలు ఎదుర్కొటుంది.
ఇక ఆ ఓటమే కల్వకుంట్ల కుటుంబంలో రాజకీయ చిచ్చుకు కారణమయ్యింది, ఇద్దరి అన్న చెల్లల్ల మధ్య రాజకీయ ఆధిపత్యానికి ఆజ్యం పోసింది. అలాగే పార్టీ విలీనం అనే నిందలు మోస్తూ, బిఆర్ఎస్ లో కట్టప్పలున్నారు, కోవర్టులు ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అనే సూచనలు ఎదుర్కొంటు ఉనికి కోసం ఆరాటపడుతుంది.
పదేళ్ల అధికారం ఇచ్చిన ఆనందాన్ని ఒక్క ఓటమి సర్వ నాశనం చేసినట్టయ్యింది. ప్రస్తుతం మళ్ళీ మొదటి నుంచి ప్రయాణం మొదలు పెట్టాల్సిన విపత్కర పరిస్థితులను ఎదుర్కొటుంది గులాబీ కారు. దీని బట్టి చూస్తే కారు బరువైనదే కానీ సైకిల్ బలమైనది అని చెప్పాలేమో..!






