జగన్‌ లేఖని కేంద్రం డీకోడ్ చేసి చూస్తుందో లేదో?

YS Jagan on Election Commission

టీడీపీ, జనసేనలు పొత్తు కుదుర్చుకొని ఎన్నికలకు సిద్ధమైనప్పుడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనసేనాని పవన్‌ కల్యాణ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని తప్పు పడుతూ, తనని ఒంటరిగా ఎదుర్కోలేని పిరికిపందలంటూ ఇద్దరినీ ఎద్దేవా చేశారు.

అయితే ఆ తర్వాత టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రం అయన టీడీపీని, చంద్రబాబు నాయుడినే విమర్శించారు తప్ప బీజేపీని వేలెత్తి చూపింది తక్కువ.

ADVERTISEMENT

ఆ ఎన్నికలలో వైసీపీ 175 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వస్తుందని జగన్‌ పలుమార్లు చెప్పారు. కానీ పోలింగ్‌ సమయానికి అయన మాట మారింది.

ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించడం లేదన్నట్లు మాట్లాడారు.

ఇటీవల రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనూ జగన్‌ ప్రధానంగా కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబు నాయుడిపైనే అనుమానాలు వ్యక్తం చేశారు తప్ప కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వంపై పల్లెత్తు మాట అనలేదు.

కానీ ఇప్పుడు ‘ఎక్స్‌’లో ఎన్నికల వ్యవస్థపై, కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై జగన్‌ పోస్ట్ చేసిన లేఖపై చర్చ మొదలైంది.

ఆయన తన సందేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్లు నిర్ణయాలు, ఓటర్ల జాబితాలు, ఎన్నికల సంఘం నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు.

ఓటర్ల జాబితాలో పేర్ల చేర్పు, తొలగింపు, పునరుద్ధరణ వంటి అంశాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని సూచించారు. 2023లో తీసుకొచ్చిన ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో పునఃసమీక్షించాలని, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ద్వారా నియామకాలు జరిగేలా సవరణ చేయాలని కోరారు.

నియామక ప్రక్రియలో తటస్థతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సవరణ, స్థానిక సంస్థల డివిజన్ల పునర్విభజన వంటి అంశాల్లో ప్రతిపక్ష అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.

ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా లక్ష్యంగా చేసుకోని జగన్‌.. ఇటీవల సీపీఐ నేతలతో సమావేశమైన తర్వాత ఈ అంశాలను ప్రస్తావించడంతో కొత్త చర్చకు దారితీసింది.

ఇది కేవలం ఎన్నికల వ్యవస్థపై జగన్‌ అభిప్రాయాలుగా మాత్రమే చూడాలా? లేక తాను కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి వైపు అడుగులు వేయాలనుకుంటున్నట్లు జగన్‌ ఈ లేఖ ద్వారా కేంద్రానికి సూచిస్తున్నారా? అనేది కేంద్రం ఆయన లేఖని డీకోడ్ చేసి స్పందించినప్పుడు తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories