ఆ కుర్చీలో సోనియా గాంధీ కూర్చోలేదు గానీ…

Sonia Gandhi Autobiography

జీవిత చరిత్రలు, ఆత్మకథలు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి. ఆయా వ్యక్తుల నెగిటివ్ కోణాలు, చీకటి అధ్యాయాలు స్పృశించకుండా, వారి గొప్పతనం ఇనుమడించేలా వ్రాయించుకుంటారు.. లేదా వ్రాస్తుంటారు.

అయితే అన్ని జీవిత చరిత్రలు, ఆత్మకథలు ఇలాగే సాగుతాయని కాదు. కొన్ని పుస్తకాలు మహనీయుల గురించి మనకు తెలియని ఎన్నో కొత్త విషయాలు మన ముందుంచుతాయి.

ADVERTISEMENT

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్ : ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలో 2004 ఎన్నికల తర్వాత ప్రధాని పదవి చేపట్టడం గురించి అటువంటి ఓ అందమైన అబద్దం చెప్పుకున్నారు.

ఆమె ప్రధాని పదవి చేపట్టకూడదని ముందే ఖచ్చితంగా నిర్ణయించుకున్నారట! కానీ మిత్ర పక్షాల ఒత్తిడి తట్టుకోలేక ఓకే చెప్పారట. ఈ విషయమై కొడుకు, కూతురు తనను నిలదీశారని, ఆ తర్వాత అంతరాత్మ ప్రబోధం మేరకు ప్రధాని పదవి చేపట్టకూడదని నిర్ణయించుకున్నారట! ఆ సమయంలో తాను తీవ్ర ఒత్తిడికి లోనయినట్లు ఆత్మకథలో పేర్కొన్నారు.

కానీ దేశ ప్రజలకు వాస్తవాలు తెలియవని, తెలిసున్నా గుర్తుండవని అనుకోవడం వల్లనే మన దేశంలో రాజకీయ నాయకులు ఇలాంటి అందమైన అబద్ధాలు చెప్పగలుగుతారు.

నాడు ఆమే కాంగ్రెస్‌ పార్టీని, యూపీయేని నడిపించారు. కనుక ఆమె ప్రధాని పదవి చేపట్టాలనుకోవడం సహజం. అయితే కాంగ్రెస్‌ నేతలు, మిత్ర పక్షాల ఒత్తిడి చేయడం, ఆ తర్వాత ఆమె అంగీకరించడం వంటి నాటకీయ పరిణామాలు రాజకీయ ఫార్ములా ప్రకారం జరిగినవే. ఆమె కూడా అదే చేశారు.

అయితే ఇటలీ దేశస్తురాలైన ఆమె ప్రధాని పదవి చేపట్టడంపై కాంగ్రెస్‌ సీనియర్ నేతలు శరత్ పవార్, పీఏ సంగ్మా, తారిక్ అన్వర్ తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. అందుకే వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. అంటే అర్థం ఏమిటి?

బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్, ఉమా భారతి, జనతా పార్టీకి చెందిన సుబ్రహ్మణ్య స్వామి తదితరులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమె భారతీయ పౌరసత్వంపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడిచింది. అయితే సుప్రీంకోర్టు వాటిని కొట్టేసినప్పటికీ, పార్టీలో, బయట ఊహించని విధంగా ఇంత వ్యతిరేకత ఎదురవడంతో సోనియా గాంధీ వెనక్కు తగ్గారు.

ఆ తర్వాత వీరవిదేయుడైన డా.మన్మోహన్ సింగ్‌ను ఆ కుర్చీలో కూర్చోబెట్టి సోనియాగాంధీయే దేశాన్ని పదేళ్ళపాటు ఏలారనే విషయం దేశ ప్రజలందరికీ తెలుసు.

డా. మన్మోహన్ సింగ్‌ దేశానికి ప్రధాని అయినప్పటికీ, ఎటువంటి అధికారిక పదవిలో లేని సోనియా గాంధీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని నేటికీ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు గొప్పగా చెప్పుకోవడమే ఆమె దేశాన్ని ఏలారనేందుకు చక్కటి ఉదాహరణ. కనుక ఆత్మకథలో ఎంత గొప్పగా అయినా వ్రాసుకోవచ్చు కానీ చరిత్రను ఎవరూ మార్చలేరు కదా?

ADVERTISEMENT
Latest Stories