ఇద్దరు ఏకాకులు… ఇద్దరు మిత్రుల కధ

Jagan KCR

ఆ ఏకాకులు ఎవరో… ఆ ఇద్దరు మిత్రులు ఎవరో అర్దమయ్యే ఉంటుంది. కానీ పూజాలైనా వ్రతాలైనా ‘ఓం’ అంటూ ప్రారంభించుకుంటాము కనుక వారిద్దరూ జగన్‌, కేసీఆర్‌ అని చెప్పుకొని మిగతా స్టోరీ చెప్పుకుందాము.

జగన్‌, కేసీఆర్‌ ఇద్దరూ వేర్వేరు కారణాల వలన దేశ రాజకీయాలలో ‘రాజకీయ ఏకాకులుగా మిగిలిపోయారు. కానీ ఆ ఏకాకులు ఇద్దరూ మంచి మిత్రులు కావడం… ఇద్దరూ ఒకేసారి రాజకీయ నిరుద్యోగులుగా మారడం విశేషం.

ADVERTISEMENT

కేసీఆర్‌ తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలతో యుద్ధం చేస్తున్నారు కనుక వాటి మిత్రపక్షాలను కూడా దూరం చేసుకున్నారు. అవిపోగా మిగిలినవాటిని వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. కానీ వాటి అవసరం కూడా తనకు లేదనుకొని టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా మార్చేసుకున్నారు.

రైతు సంఘాల నేతలు, రాజకీయ నిరుద్యోగులు, రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నవారినీ కలుపుకొని ఢిల్లీకి బుల్లెట్ రైలులా దూసుకుపోయి, చక్రం తిప్పేసి మోడీని దించేయాలనుకున్నారు. కానీ సొంత రాష్ట్రంలోనే వరుసగా రెండు ఎన్నికలలో ఓడిపోవడంతో ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రావడం తగ్గించేసి కొడుకు కేటీఆర్‌ని బయట తిప్పుతున్నారు.

కేసీఆర్‌ తాను రాజకీయ సన్యాసం తీసుకొని కొడుకు చేతికి పార్టీని అప్పగించినా వేరేలా ఉండేది. కానీ కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఉండిపోయి కొడుకుని బయట తిప్పుతుండటంతో ప్రజలకు, రాజకీయ వర్గాలకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి. బిఆర్ఎస్‌ ఇప్పుడు బలమైన నాయకత్వం లేని పార్టీగా అందరికీ కనిపిస్తోంది. ఆ విదంగా కూడా బిఆర్ఎస్‌కు చాలా డ్యామేజ్ జరుగుతోంది.

ఇక జగన్‌ ఎలాగూ తనకు మరో 20-30 ఏళ్ళు రాజకీయాలు చేయగల వయసు, ఓపిక, సామర్ధ్యం ఉన్నాయని చెప్పుకున్నారు. పైగా ఇంకా కేసులు కూడా మొదలవలేదు. కనుక 24న ఢిల్లీలో ధర్నా కార్యక్రమం పెట్టుకున్నారు.

అయితే జగన్‌ తన కేసుల కారణంగా మోడీని కాదని అటూ ఇటూ దిక్కులు చూడలేని నిసహాయత ఉంది. కనుక మోడీ పట్టించుకోకపోయినా ఆయనకు ఆగ్రహం కలిగించే పనులేవీ చేయలేరు. ఈ విషయం జాతీయ స్థాయి ప్రతిపక్ష పార్టీలకు కూడా తెలుసు బహుశః అవి కూడా ఆయనను పట్టించుకోకపోవచ్చు.

అయితే జగన్‌, కేసీఆర్‌ ఇద్దరూ ప్రాణ స్నేహితులే… ఇద్దరూ కష్టాల్లో ఉన్నారు. కనుక ఒకరికొకరు సాయం చేసుకోవచ్చు. కనుక ఢిల్లీలో ధర్నాకి బిఆర్ఎస్‌ నేతలని పంపమని అడిగే నైతిక హక్కు జగన్‌కు ఉంది. బహుశః కేసీఆర్‌కి కూడా కష్టంలో ఉన్న తన మిత్రుడికి మళ్ళీ సాయపడాలనే ఉండవచ్చు.

కానీ కూతురు కల్వకుంట్ల కవిత ఇంకా జైల్లోనే ఉంది. అదీగాక ఎన్డీయేలో టిడిపి, టిడిపి ప్రభుత్వంలో బీజేపీ ఉన్నాయి. కనుక కేసీఆర్‌ కూడా మోడీకి ఆగ్రహం కలిగించే పనులేవీ చేయలేరు.

కనుక ఇద్దరు ఏకాకులు మళ్ళీ ఏకాకులుగానే మిగిలిపోయారు. ఇద్దరూ మిత్రులే అయినప్పటికీ ఒకరికొకరు సాయం చేసుకోలేకపోతున్నారు పాపం!

ADVERTISEMENT
Latest Stories