ఏపీ ప్రాజెక్టులను బీఆర్ఎస్‌ వ్యతిరేకిస్తున్నా జగన్‌ మౌనమేల?

Jagan silent on BRS opposition to AP water

ఏపీ ప్రభుత్వం పల్నాడు జిల్లాలోని 363 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.1,200 కోట్లతో పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మిస్తోంది. నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్ నుంచి 1.865 టీఎంసీల నీటిని తీసుకొని సుమారు 10 లక్షల మందికి తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

దీనిపై తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళనలు మొదలుపెట్టింది. ఈ ఒత్తిడితో తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది.

ADVERTISEMENT

అయితే ఏపీ ప్రభుత్వం ఈ అభ్యంతరాలను కొట్టిపడేసింది. కృష్ణా జలాల్లో ఏపీ వాటాగా లభించిన నీటినే వాడుకుంటున్నామని స్పష్టం చేసింది.

మరోవైపు బీఆర్ఎస్‌ సీనియర్ నేత హరీష్ రావు ఈ ప్రాజెక్టు వలన తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించుకుపోతే నాగార్జునసాగర్ ఖాళీ అయిపోతుందని, నల్గొండ, హైదరాబాద్‌కు తాగునీటి సమస్య ఏర్పడుతుందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అడ్డుకోవడంలో విఫలమవుతోందని మండిపడ్డారు.

బీఆర్ఎస్‌ చేస్తున్న ఈ నీళ్ళ రాజకీయాలతో ఏపీ ప్రాజెక్టుకు భవిష్యత్తులో అవరోధాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. రూ.1,200 కోట్లు ఖర్చు చేసిన తర్వాత అభ్యంతరాల కారణంగా ప్రాజెక్టు నిలిచిపోతే ప్రయోజనం ఉండదు. కనుక ఏపీ ప్రభుత్వం ఇప్పుడే తగిన చర్యలు చేపట్టాలి.

చివరిగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బీఆర్ఎస్‌ పార్టీ ఈ ప్రాజెక్టును ఇంతగా వ్యతిరేకిస్తున్నా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించడం లేదు. మాజీ సీఎంగా పల్నాడు ప్రజలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టుకు, దానిని నిర్మిస్తున్న ఏపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాలి కదా? కానీ రాష్ట్ర ప్రయోజనాల కంటే బీఆర్ఎస్‌తో స్నేహ సంబంధాలే ముఖ్యమని భావిస్తున్నారా? అందుకే మౌనం వహిస్తున్నారా?

ADVERTISEMENT
Latest Stories