ప్రధాన ప్రతిపక్షనాయకుడి హోదా పాటకు.. వేళాయెరా!

YS Jagan Mohan Reddy's absence from Andhra Pradesh Assembly winter sessions ahead of the Investment Protection Bill debate.

ప్రధాన ప్రతిపక్షనాయకుడి హోదా… పాటకు వేళాయెరా అంటే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయని అర్థం.

ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. కనుక నేడో రేపో వైసీపీ మళ్ళీ ఈ పాట అందుకుంటుంది. దీనినే మరోలా చెప్పాలంటే వసంతకాలం వస్తోందని కోయిల కూసి తెలియజేసినట్లుగానే, ఈ పాటతో త్వరలో శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయని వైసీపీ తెలియజేస్తుందన్న మాట!

ADVERTISEMENT

అయితే శాసనసభ సమావేశాలకు సమాంతరంగా తాడేపల్లి ప్యాలస్‌లో మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించే బదులు, ధైర్యంగా శాసనసభకు వచ్చి మాట్లాడాలని స్పీకర్‌ అయ్యన్న పాత్రుడుతో సహా అందరూ పదేపదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు.

వారికి జవాబుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా పాట వినిపిస్తుంటారు. గత రెండున్నరేళ్ళుగా ఇలాగే జరుగుతోంది. ఈసారి, ఇక ముందు కూడా ఇలాగే జారి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చాలా దౌర్జన్యాలకు పాల్పడిందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా ఆపార్టీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారు. కనుక శాసనసభకు వచ్చి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయవచ్చు.

కానీ తాను శాసనసభకు రాకుండా మండలి సమావేశాలకు మాత్రం ఎమ్మెల్సీలను పంపిస్తుంటారు. అక్కడ వైసీపీ ఫ్లోర్ లీడర్ బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారని సొంత మీడియాలో అచ్చేసుకొని సంతోషపడుతుంటారు.

ఈసారి శాసనసభ సమావేశాల్లో ప్రధానంగా ‘పెట్టుబడుల రక్షణ చట్టం బిల్లు’ ప్రవేశ పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ చట్టం ద్వారా భవిష్యత్‌లో ఎప్పుడైనా ప్రభుత్వాలు మారినా గత ప్రభుత్వాలు చేసుకున్న పారిశ్రామిక ఒప్పందాలు, విధానాలు రద్దు కాకుండా చట్టపరమైన భరోసా కల్పిస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు.

కనుక వైసీపీ ఈ చర్చలో పాల్గొని తన వాదనలు వినిపించవచ్చు. కానీ శాసనసభకు రాదు కనుక కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా చర్చించుకొని ఆమోదముద్ర వేయక తప్పదు. అప్పుడు దానిపై జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి విమర్శలు గుప్పించక మానరు.

ADVERTISEMENT
Latest Stories