వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేసే పద్దతిని ‘హిట్ అండ్ రన్’ అన్నారు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు.
జగన్ ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసి, వెంటనే బెంగళూరు ప్యాలస్‌కు వెళ్ళిపోతారని, మళ్ళీ కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ ఇలాగే మాట్లాడి వెళ్ళిపోతుంటారని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
అయితే ఆయన కూడా జగన్‌ని తక్కువ అంచనా వేసినట్లనిపిస్తుంది. కేవలం హిట్ అండ్ రన్ మాత్రమే కాదు.. ‘రన్ ఫర్ ఏ హిట్’ కూడా అని జగన్ నేడు నిరూపిస్తున్నారు.
హిట్ అండ్ రన్ కేసులో సాక్ష్యాలు తారుమారు చేయబోయి జైలుకి వెళ్ళిన మాజీ మంత్రి సీదిరి అప్పల రాజుని పరామర్శించేందుకు జగన్ నేడు విశాఖ చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా రోడ్డు మార్గాన్న శ్రీకాకుళం బయలుదేరారు. అంటే ‘రన్ ఫర్ ఏ హిట్’ అనుకోవాలేమో?
‘జగన్ పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు… అయినా వేలాదిగా తరలివచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలు..’ అంటూ వైసీపీ సొంత మీడియాలో కవరేజ్ కూడా మొదలైపోయింది. కనుక రాజకీయ వేధింపుల స్టోరీకి బలమైన స్క్రిప్ట్ రెడీ అయినట్లే. జైల్లో సీదిరి అప్పలరాజుని పరామర్శించిన తర్వాత జగన్ బయటకు వచ్చి మీడియాతో ఎలాగూ అదే స్టోరీ చెప్తారు కూడా.
జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కరక్టేనని సరిపెట్టుకున్నా, జైల్లో ఉన్న సీదిరి అప్పల రాజుని పరామర్శిస్తే, ఆయన కుమారుడి చేతిలో ప్రాణం పోగొట్టుకున్న గొర్రెల కాపరి దానయ్య కుటుంబం ఏమని భావిస్తుంది?అని ఆలోచించినట్లు లేదు.
ఒకవేళ అధికార పార్టీ నేత వలన దానయ్య ప్రాణం పోగొట్టుకుంటే, అప్పుడు జగన్ హుటాహుటిన దానయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి బయలుదేరేవారు కదా? కానీ దానయ్య కుటుంబాన్ని పరామర్శించాల్సిన జగన్, జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజుని పరామర్శించడం ఏమిటి?
మరో 48 గంటల్లో భోగాపురం విమానాశ్రయం అట్టహాసంగా ప్రారంభోత్సవం కాబోతుంటే సరిగ్గా ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈ పరామర్శ యాత్ర ఎందుకు పెట్టుకున్నట్లు?మరో మూడు రోజుల తర్వాత వెళ్తే జైల్లో ఉన్న సీదిరి ఏమైనా నొచ్చుకుంటారా?
జగన్ కత్తికి రెండు వైపులా పదునేనని బొండా ఉమా వ్యవహారంతో స్పష్టమైంది కనుక ప్రభుత్వం, కూటమి పార్టీలు అప్రమత్తంగా ఉండటం మంచిది.




