జయప్రద కోరిక నెరవేరుతుందా?

Jaya_Prada_in_Telugu_Politicsతెలుగు ప్రజలకు పరిచయమే అవసరం లేని పేరు జయప్రద. తన అందచందాలతో, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించి క్రమంగా తెలుగు ప్రజలకు దూరమయ్యారు.

ఈరోజు ఆమె హైద‌రాబాద్‌లో ఓ షోరూమ్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “నాకు తెలుగు ప్రజలంటే చాలా ఇష్టం. మళ్ళీ ఆంద్రప్రదేశ్‌ లేదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోకి రావాలని కోరుకుంటున్నాను. అయితే ప్రస్తుతం యూపీ రాజకీయాలలో ఉన్నందున మా బీజేపి అధిష్టానానికి తెలియజేసి వారు అంగీకరిస్తే తప్పకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలలోకి మళ్ళీ వస్తాను,” అని జయప్రద అన్నారు. ఈ సందర్భంగా ఆమె సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించాలనుకోవడం సరికాదని భావిస్తున్నానని చెప్పారు.

ADVERTISEMENT

జయప్రద సినిమాలలో కూడా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఆమె దక్షిణాది, హిందీ సినీ పరిశ్రమలలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానం, మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించి సమైక్య రాష్ట్రంలో కొన్ని ఎదురుదెబ్బలు తిన్నారు.

జాతీయ స్థాయిలో తనకున్న పరిచయాలతో ఆమె యూపీ రాజకీయాలలో ప్రవేశించి ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ అక్కడ కూడా ఆమె రాజకీయ జీవితంగా సాఫీగా సాగలేదు. యూపీలొ సమాజ్‌వాదీ పార్టీలో చేదు అనుభవాలు ఎదురైన తరువాత మొదట కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకొన్నారు కానీ చివరికి బీజేపిలోకి ప్రవేశించారు. అయితే ఆ పార్టీలో కూడా ఆమెకు తగినంత ప్రాధాన్యత లభించడం లేదనే చెప్పాలి.

ఇప్పుడు ఆంద్రప్రదేశ్‌ లేదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మళ్ళీ ప్రవేశించాలని ఆమె కోరుకుంటున్నప్పటికీ, రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు చాలా దిగజారిపోయి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒక రకంగా, ఆంద్రప్రదేశ్‌ రాజకీయాలు మరో రకంగా సాగుతున్నాయి.

ఆమె ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవారు కనుక ఇక్కడ రాజకీయాలలో పాల్గొనాలంటే బీజేపి ద్వారానే పాల్గొనాల్సి ఉంటుంది. కానీ ఏపీలో బీజేపిని పట్టించుకునేవారే లేరు. కనుక ఆమె వచ్చే ఎన్నికలలో బీజేపి తరపున పోటీ చేసినా ఓటమి తప్పకపోవచ్చు.

ఆమె తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీచేసేందుకు మంచి అవకాశాలే ఉన్నాయి. అయితే ఆమె లోక్‌సభకు పోటీ చేయాలనుకొంటె మాత్రం గెలవడం చాలా కష్టం. ఎందుకంటే, ఈసారి సార్వత్రిక ఎన్నికల తరువాత సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకుంటున్నారు. కనుక ఈసారి ప్రతీ ఒక్క లోక్‌సభ సీటు కూడా ఆయనకు ముఖ్యమే. కనుక ఒక్క సీటు కూడా కోల్పోకుండా అన్నీ గెలుచుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు.

కనుక జయప్రద తెలంగాణలో శాసనసభకు పోటీ చేస్తే ఏమైనా అవకాశం ఉండవచ్చు. కానీ ఇంతకాలం తరువాత ఆమె రాష్ట్ర రాజకీయాలలోకి వస్తే ప్రజలు ఆమెను నమ్మి ఓటేస్తారా? అంటే అనుమానమే.

ADVERTISEMENT
Latest Stories