టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలనాత్మక వ్యాఖ్యలకు తెరలేపారు. “తనకు అదృష్టం లేదు గనుకనే మంత్రిని కాలేకపోయా… చంద్రబాబుకు ‘లక్’ ఉంది కాబట్టే ముఖ్యమంత్రి అయ్యారని” జేసీ చేసిన వ్యాఖ్యలు చూసి రాజకీయ జనాలు అవాక్కవుతున్నారు. నిర్మొహమాటంగా మాట్లాడతారని పేరు ఉన్నప్పటికీ, ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పైనే సంచలనకరమైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యాయి.
“సిఎం చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇవ్వరన్న విషయం తెలుసునని, నేను చస్తే కానీ తనకు మంత్రి పదవి ఇవ్వరా అని సిఎంతో సరదాగా అన్నానని” చెప్పిన జేసీ… “పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయలేరని జోస్యం చెప్పారు. ఈ ప్రాజెక్ట్ గురించి పుట్టినప్పటినుంచీ వింటున్నానని, అది పూర్తవుతుందన్న నమ్మకం తనకు లేదని అన్నారు. ప్రతి రోజూ కూలి పనికి వెళ్లేవారు రోజులో ఐదు సార్లు టీ తాగుతుంటారని, అలాంటి వారికి కిలో రూపాయి బియ్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, తానూ సంక్షేమ పధకాలకు వ్యతిరేకిని” ఘాటు వ్యాఖ్యలు చేసారు.
అధికార ప్రభుత్వానికి అనుకూలమైనా, వ్యతిరేకమైనా తన భావాలను స్పష్టంగా వెల్లడించడంలో జేసీ దివాకర్ రెడ్డి ముందుంటారు. నిజానికి జేసీ తెలిపిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే విషయం ఇప్పటికే ప్రజల్లో నలుగుతున్నదే. అయితే సహజంగా అధికార ప్రభుత్వంలో ఉన్న వారు ఇంత కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడరు. మరి అలా చేస్తే జేసీ స్టైల్ ఏముంటుంది..!





