2024 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిలు గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పుంగనూరు, కుప్పం, పులివెందుల, కాకినాడ, తాడిపత్రి ఇలా చాల నియోజకర్గాలలో వైసీపీ vs టీడీపీ అన్నట్టుగా రాజకీయాలు నడిచేవి.
చంద్రబాబు నాయుడు నియోజకర్గమైన కుప్పంలో వైసీపీ జెండా కూడా ఎగరాలనే పట్టుదల, జగన్ నియోజకర్గమైన పులివెందులలో కేవలం వైసీపీ జెండా మాత్రమే ఉండాలనే పట్టింపు కారణంగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రత్యర్థి టీడీపీ నేతల మీద ఆ పార్టీ క్యాడర్ మీద పెద్ద ఎత్తున అధికార జులం ప్రదర్శించింది.
పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నియోజకర్గమైన పుంగనూరు లో పసుపు జెండా కనిపించినా, పసుపు చొక్కా తొడిగినా అదొక నేరం అన్నట్టుగా టీడీపీ క్యాడర్ పై బెదిరింపులకు పాల్పడేవారు వైసీపీ శ్రేణులు. అలాగే ఇటు కాకినాడ లో సైతం వైసీపీ నేత ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి నియోజకవర్గం కూడా జనసేన పై రాజకీయ దాడులకు కేంద్రంగా నిలిచింది.
ఇక తాడిపత్రిలో సైతం వైసీపీ నేత పెద్దా రెడ్డి, టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఆధిపత్య రాజకీయ యుద్ధం కొనసాగింది. దాదాపు ఇటువంటి కీలక నియోజకర్గాలన్నిటిలోను 2024 ఎన్నికల తరువాత రాజకీయ నిశ్శబ్దత చోటుచేసుకుంది.
కానీ ఒక్క తాడిపత్రిలో మాత్రం ఇప్పటికి అదే విధమైన రాజకీయం కొనసాగుతూ నిత్యం కేతిరెడ్డి పెద్దారెడ్డి vs జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. నిత్యం ఏదొక వివాదంతో ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకుంటూ తాడిపత్రి రోడ్లను వారి రాజకీయ రణరంగాలుగా మారుస్తున్నారు.
ఇందులో ఏ ఒక్కరిని సమర్ధించేందుకు లేదు. గతంలో వైసీపీ నేతలు తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇక ఇపుడు నా వంతు అన్నట్టుగా టీడీపీ నాయకుడు జేసీ ముందుకెళ్లడం ఈ వివాదాన్ని నిత్యం రగిలిస్తూనే ఉంటుంది. టీడీపీ వారు మా పై దాడులకు దిగుతున్నారు అంటూ పెద్దా రెడ్డి వర్గం , కేతిరెడ్డి రెచ్చకొట్టే రాజకీయం చేస్తున్నారు అంటూ జేసీ వర్గం ఇలా తాడిపత్రిలో రాజకీయ జ్వాలను రగిలిస్తూనే వస్తున్నారు.
అటు తాడిపత్రి స్థానికులు కూడా ఈ ఇరువర్గాల రాజకీయ వాదనతో విసిగిపోతున్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని ఈ ఇరువర్గాల రాజకీయ పోరుకి ఒక ఎండ్ కార్డు వేసి, తాడిపత్రిలో రాజకీయ వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఈ ఇరువర్గాల రెడ్ల ఆధిపత్య రాజకీయానికి ముగింపు దొరికేదెప్పుడు.?




