కాసేపటి క్రితం చిత్తూర్ జిల్లా ప్రభుత్వ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఒక ఆసక్తికరమైన ట్వీట్ వచ్చింది. జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో 100% రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తాకి, ఇందుకు సహకరించిన డిపిఆర్ఓ పద్మజకి, డీఈఓ పాండురంగ స్వామికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ కృతజ్ఞతలు తెలియజేసిందని ఆ ట్వీట్ సారాంశం. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి తీవ్ర విమర్శలకు గురి అవుతుంది.
ఒక జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వ పాఠశాలలో నమోదు పెరగడానికి కృషి చెయ్యాల్సింది పోయి జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో 100% రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యడం ఏంటి? ఒక జిల్లా కలెక్టర్ కు ప్రైవేటు పాఠశాలలో 100% రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అధికారాలు ఉన్నాయా? అసలు సమాజంలో ఎందరో పేదలు ఉండగా ఈ సదుపాయం కేవలం జర్నలిస్టు పిల్లలకు మాత్రమే కలిపించడం ఏంటి? ఇది సదరు కలెక్టర్ సొంత నిర్ణయమా? లేక ప్రభుత్వ విధానమా?
ప్రభుత్వ విధానమైతే ఇది వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది. జర్నలిస్టుల మెప్పు కోసం తీసుకున్న నిర్ణయం కాదా? సదరు మంత్రిగా దీనిపై సమాధానం చెప్పాలి. ఇప్పటికే ప్రైవేట్ బడులలో చదువుకునే విద్యార్థులకు కూడా అమ్మ ఒడి వర్తింప చెయ్యడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలో ఇటువంటి చర్యలు ఆ విమర్శలకు మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది.



