రంజాన్ సందర్భంగా విడుదలైన “జనతా గ్యారేజ్” రికార్డుల మోత కొనసాగుతోంది. తొలి 24 గంటల లోపే 1 మిలియన్ క్లబ్ ను అందుకుని, తెలుగు సినిమా టీజర్లలో ఆల్ టైం రికార్డులను అందుకున్న ‘జనతా గ్యారేజ్’ తాజాగా 4 మిలియన్ క్లబ్ ను దాటి 5 మిలియన్ క్లబ్ దిశగా దూసుకెళ్తోంది. అంతకుముందు ‘నాన్నకు ప్రేమతో’ టీజర్ తో కొట్టిన రికార్డును జూనియర్ ఎన్టీఆరే మళ్ళీ తిరగ రాస్తుండడం విశేషం.
‘జనతా గ్యారేజ్’ తెలుగు టీజర్ తో పాటు ఫాస్టెస్ట్ 1 మిలియన్ క్లబ్ అందుకున్న జాబితాలో మలయాళ టీజర్ కూడా ఆల్ టైం రికార్డులు సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఆడియో ఈ నెల 22వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేస్తోంది. ఇటీవల లీక్ అయిన ఎన్టీఆర్ డ్యాన్సింగ్ స్టెప్పులు చూసి యంగ్ టైగర్ అభిమానులు మురిసిపోగా, బ్యాక్ గ్రౌండ్ లో వినపడిన దేవిశ్రీప్రసాద్ సంగీతం ఆకట్టుకునే విధంగా సాగింది.
ఓ పక్కన టీజర్లో బ్యాక్ గ్రౌండ్ సంగీతం అదిరిపోయేలా ఉండడం, మరో వైపు లీకైన వీడియోలో ఆకట్టుకునే సంగీతం వినిపిస్తుండడంతో “జనతా గ్యారేజ్” ఆడియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై ఏర్పడిన అంచనాలను చిత్ర యూనిట్ అందుకోగలిగితే, యంగ్ టైగర్ అభిమానులకు మరోసారి ‘సింహాద్రి’ పండగ ఖాయం అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఆ సంగతి తెలియాలంటే ఆగష్టు 12వ తేదీ వరకు వేచి చూడాలి.



