హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి నవంబర్ 11న ఉప ఎన్నిక జరుగబోతోంది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీళ మద్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి రవీంద్రనాథ్ భార్య సునీతని ప్రకటించి అప్పుడే ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టెసింది.
నేడో రేపో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్ధిని ప్రకటిస్తుంది. బీజేపి కూడా పోటీ చేయడానికి సిద్దపడుతున్నప్పటికీ, పెద్దగా ఆశలు పెట్టుకోనట్లే కనిపిస్తోంది. యూపీ, బిహార్, మహారాష్ట్ర ఎన్నికలలో పోటీ చేస్తుండే మజ్లీస్ పార్టీ, జూబ్లీహిల్స్‌లో పోటీ చేయడం లేదు ఎందుకో? కనుక అది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో ఏదో ఓ పార్టీకి లోపాయికారిగా సహకరించవచ్చు.
ఈ నేపధ్యంలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపి నేతలతో సమావేశమవడం ఆలోచింపజేస్తోంది. కానీ తెలంగాణ-టీడీపి ఈ ఎన్నికలలో పోటీ చేసే పరిస్థితిలో లేదు.
కనుక టీడీపి ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. 1. ఎన్డీయే భాగస్వామిగా బీజేపి అభ్యర్ధికి మద్దతు ప్రకటించడం. 2. తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లుగానే, ఈ ఉప ఎన్నికలో కూడా పోటీ చేయకుండా కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపుకి పరోక్షంగా సహకరించడం.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపి గెలిచే అవకాశాలు ఏమాత్రం ఉన్నా టీడీపి తప్పక మద్దతు ఇస్తుంది. కానీ లేదు కనుక రెండో ఆప్షన్ ఎంచుకునే అవకాశమే ఎక్కువ. తద్వారా నీళ్ళ పేరుతో రాజకీయాలు చేస్తూ ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న బీఆర్ఎస్ పార్టీకి మరోసారి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వగలదు.




