ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 11 అనే అంకే చాల ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ సంఖ్య కున్న బలం ఒక పార్టీ బలహీనతను సూచిస్తుంది, అలాగే మరోపార్టీ బలాన్ని తెలియచేస్తుంది. ఇటువంటి 11 ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా కీలకం కానుంది.
బిఆర్ఎస్ పరువుకు, కాంగ్రెస్ ప్రతిష్టకు ప్రతీక జరగబోతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోరాటం ఈ నెల అంటే నవంబర్ 11 న జరగనుంది. అందుచేత 11 అనేది తెలంగాణ రాజకీయాలలో కూడా ఒక ప్రతిష్టాత్మకమైన పాత్ర పోషించబోతుంది.
జరగనున్నది ఉపఎన్నికే అయినా అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తమ పార్టీ భవిష్యత్ గా పరిగణిస్తున్నాయి. తమ ఏడాదిన్నర్ర పాలనకు ఈ ఉపఎన్నిక కొలమానంగా కాంగ్రెస్ భావిస్తుంటే, తమ రాబోయే మూడున్నరేళ్ల భవిష్యత్ కు ఈ ఎన్నిక మార్గదర్శకం కాబోతుందంటూ బిఆర్ఎస్ అడుగులేస్తోంది.
అయితే ఈ ఉపఎన్నికల ప్రచార బహిరంగ పోరు నిన్నటితో ముగనుండడంతో ఇక తెరచాటు పంపకాల జోరు ఊపందుకుంది. ఈ హోరా హోరి పోరులో తమ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుని తెలంగాణలో గులాబీ కారు జోరు ఊపందుకుంది అంటూ పార్టీ క్యాడర్ ను లీడర్లను తట్టిలేపాలని బిఆర్ఎస్ అధిష్టానం తహతహలాడుతోంది.
అలాగే తెలంగాణలో తెరాస తో పాటే కేసీఆర్ రాజకీయ ప్రయాణం కూడా ముగిసిపోయిందని, ఈ ఉపఎన్నికల గెలుపుతో మరోసారి గులాబీ కారుకి తెలిసొచ్చేలా చెయ్యాలని రేవంత్ హస్తం ఆరాటపడుతుంది. మరి 11 న జరగబోయే ఈ ఉపఎన్నిక ఫలితాలు ఏ పార్టీలో జోష్ ని నింపనున్నాయో ఈ నెల 14 న తెలియనుంది.






