కేసీఆర్‌ కొత్త పార్టీతో జాతీయ రాజకీయాలలోకి!

KCR_New_Party_to_Enter_National_Politicsతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించడానికి తనకు నచ్చిన మార్గం ఎంచుకొన్నారు. వివిద రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వాటితో కప్పల తక్కెడ వంటి కూటమిని ఏర్పాటు చేయడంకంటే సొంతంగా ఓ జాతీయ పార్టీ పెట్టుకొని తనకు నచ్చిన విదంగా ముందుకు సాగడమే మంచిదని నిర్ణయించుకొన్నారు.

అయితే తెలంగాణలో అత్యంత ప్రజాధారణ, సుమారు 60 లక్షల మంది సభ్యత్వం కలిగిన తమ టిఆర్ఎస్‌ పార్టీని యదాటడంగా కొనసాగిస్తూనే కొత్తగా జాతీయపార్టీ ఏర్పాటు చేసుకోవాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇక కొత్తగా స్థాపించబోయే పార్టీకి భారత్‌ రాష్ట్రీయ సమితి అనే పేరును దాదాపు ఖరారు చేసినట్లే భావించవచ్చు.

ADVERTISEMENT

ఈ నెల 19వ తేదీన టిఆర్ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి దానిలో తుది నిర్ణయం తీసుకొన్నాక, ఢిల్లీకి వెళ్ళి అక్కడ వివిద పార్టీల అధినేతల సమక్షంలో సిఎం కేసీఆర్‌ తన కొత్తపార్టీని ప్రకటించాలని భావిస్తున్నారు. వెంటనే కేంద్ర ఎన్నికల కమీషన్‌ వద్ద తన కొత్త పార్టీని రిజిస్ట్రేషన్ చేయిస్తారు.

రాష్ట్రపతి ఎన్నికలో కూడా బిజెపికి పోటీగా తన మిత్రపక్షాలతో కలిసి అభ్యర్ధిని బరిలో దింపాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అవలీలగా తన అభ్యర్ధిని గెలిపించుకోగలదు కనుక మిత్రపక్షాలు ఆయనకు ఈ విషయంలో సహకరించకపోవచ్చు. అదే కనుక జరిగితే జాతీయ రాజకీయాలలో ప్రవేశించక మునుపే సిఎం కేసీఆర్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలినట్లు భావించవచ్చు. ఈ విషయం కేసీఆర్‌కు తెలియదనుకోలేము కనుక ఆయన చేజేతులా ఈ సమస్యను నెత్తిన పెట్టుకోకుండా మౌనం వహించే అవకాశం ఉంది.

ఏది ఏమైనప్పటికీ సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయ ప్రవేశం ఆయన రాజకీయ జీవితంలో ఓ నూతన అధ్యాయం. ఒకవేళ దానిలో కూడా ఆయన విజయం సాధిస్తే ఇక ఆయనకు తిరుగే ఉండకపోవచ్చు

ADVERTISEMENT
Latest Stories