మార్పు మంచితే అనుకుంటాం కానీ మార్పు అంత మంచిది కాదు అంటున్నారు బిఆర్ఎస్ నేతలు. తెరాస గా ఉన్న ప్రాంతీయ పార్టీని బిఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని ఆశపడిన బిఆర్ఎస్ నాయకులకు, పార్టీ అధినేత కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు అనుకోని షాక్ ఇచ్చారు.
పార్టీ పేరు మార్పుతో తమ రాజకీయ తలరాతలు మారిపోయాయని ఆలోచనలో ఉన్నారు తెరాస నేతలు. పార్టీ అంతర్గత సమావేశాల కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కడియం శ్రీహరి ఈ విషయం పై తన అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు. తెరాస పేరుని బిఆర్ఎస్ గా మార్చడం వలన సుమారుగా పార్టీ ఒకటి నుంచి రెండు శాతం ఓట్లను నష్టపోవలసి వచ్చిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ పేరులోనే తెలంగాణ సెంటిమెంట్ ని గుర్తుచేసిన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు తెరాస ను అత్యంత చేరువ చేసారు.భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చిన తెరాస పార్టీని తెలంగాణ ప్రజలకు దూరం చేసినట్లయింది అందుకనే పార్టీ పేరు పునః మార్పు చేసి తెరాస గా మార్చాలంటూ ఆ పార్టీ నాయకులు పట్టుబడుతున్నారు. మరి పార్టీ అధిష్టానం పార్టీ పేరు మార్పు పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.




