‘వీరమ్’ రీమేక్ గా ఇటీవల విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ సినిమా చివరకు ‘వన్ డే వండర్’గానే మిగిలిపోయింది. తొలిరోజు మంచి వసూళ్ళను సాధించిన ఈ సినిమా, రెండవ రోజు నుండి కలెక్షన్లు డ్రాప్ అవ్వడం ప్రారంభించాయి. అలా తొలి మూడు రోజులకు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ ను రాబట్టిన ‘కాటమరాయుడు’ ఆ తర్వాత నుండి పూర్తిగా కనుమరుగయ్యాడు. విక్టరీ వెంకటేష్ ‘గురు’ సినిమా, పవన్ సినిమా కంటే మంచి వసూళ్ళను రాబడుతుండడంతో, ఇక పవన్ సినిమా క్లోజింగ్ కు వచ్చేసిందని ట్రేడ్ వర్గీయులు డిక్లేర్ చేసారు.
ఓవర్సీస్ లో 1 మిలియన్ సంఖ్యను చేరుకున్నప్పటికీ, ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి రీత్యా, దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇక, రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో పవన్ కున్న భారీ మాస్ మార్కెట్ రీత్యా రికార్డు కలెక్షన్లు వస్తాయని ఆశించారు. అయితే పవన్ ఎంత అందంగా కనిపించినా, కొత్తదనం లేనటువంటి రొటీన్ ‘కాటమరాయుడు’ను చూసేందుకు ప్రేక్షకులు ఏ మాత్రం మొగ్గు చూపకపోవడంతో, సరికొత్త రికార్డులు అందుకుంటాడని భావించిన పవన్ అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి.
దీంతో పవన్ కెరీర్ లో కమర్షియల్ గా మరో ఫ్లాప్ వచ్చిచేరింది. అయితే పవన్ గత సినిమా ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ మాదిరి డిజాస్టర్ కాకపోయినప్పటికీ, ఆ సినిమాతో పోలిస్తే డిస్ట్రిబ్యూటర్లు కొంతవరకు సేఫ్ జోనర్ లో ఉన్నారన్న టాక్ హల్చల్ చేస్తోంది. నిజానికి ‘సర్ధార్’ సినిమా నష్టాలను పూడ్చేందుకు ఈ సినిమాను తీస్తే, ఇది కూడా నష్టాల బారిన పడడంతో, డిస్ట్రిబ్యూటర్లు ఎటూ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే తదుపరి చిత్రం త్రివిక్రమ్ వంటి క్రేజీ డైరెక్టర్ తో వస్తుండడంతో, పవన్ ఫ్యాన్స్ ఆశలు నెరవేరే అవకాశాలు కనపడుతున్నాయి.



