“తెలంగాణ ఏర్పడితే మొట్టమొదట దళితుడుని ముఖ్యమంత్రి చేస్తాను. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తాము,” అని కేసీఆర్ దళితులకు ఒక అద్భుతమైన సినిమా చూపారు. అది సినిమా వంటిదే గనుక ఈ రెండు హామీలు అమలు చేయనేలేదు. మొదటిసారి, రెండోసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. మళ్ళీ 2028 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే ఆయనే చేపడతారని అబ్బాయ్ చెపుతున్నాడు.
ఇప్పుడు ఆయన కూతురు కల్వకుంట్ల కవిత కూడా అలాంటి వాగ్ధానమే చేస్తున్నారు. ఆలూ లేదు చూలూ లేదన్నట్లు అప్పుడే ఆమె ఎన్నికల హామీలు ప్రకటిస్తున్నారు. తాజాగా ఆమె ‘భూలక్ష్మి పధకం’ ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పధకం కింద రాష్ట్రంలో అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి ఒక ఎకరం చొప్పున భూమి పంపిణీ చేస్తామని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ మేరకు ఆమె భూలక్ష్మి పోస్టర్ కూడా విడుదల చేశారు.
తెలంగాణ ప్రజలు తండ్రి మాట నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే అయన హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు తనని నమ్మి తనకు అధికారం కట్టబెట్టమని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభాలో సగానికి పైగా పేదలే ఉన్నారు. కనుక ఆమె చెప్పినట్లు అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి ఎకరా చొప్పున పంచాలంటే తెలంగాణలో ఉన్న భూమి సరిపోదు. కానీ కవిత ఎకరం చొప్పున పంచుతానంటున్నారు?ఇది ఎలా సాధ్యం?ఒకవేళ నిజంగా ఇలా పంచేందుకు సరిపడా భూమి ఉండి ఉంటే, ఆమె తండ్రి కేసీఆరే పంచిపెట్టి ఉండేవారు కదా? అయినా ఇప్పుడు దేశంలో మారుమూల గ్రామాలలో కూడా భూముల విలువ పెరిగిపోయినప్పుడు, వాటిని అప్పనంగా పంచిపెడతామనే కల్వకుంట్ల కవిత మాటలు నమ్మశక్యంగా ఉన్నాయా?
తెలంగాణ రక్షణ సమితి (TRS) అధికారంలోకి వస్తే…. కుటుంబానికి 1 ఎకరం భూమి ఇస్తాము…
–@RaoKavitha #TRS pic.twitter.com/QiGm4xdSp4
— M9 NEWS (@M9News_) August 18, 2026




