ఇదివరకు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలో సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని కల్వకుంట్ల కవిత తండ్రికి పిర్యాదు చేశారు.
ఈ విషయం తెలుసుకొని అయన కేసీఆర్‌ని కలిసి వివరణ ఇచ్చుకునేందుకు చాలా ప్రయత్నించారు. కానీ కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
కనుక కేసీఆర్ ఆయనపై వేటు వేస్తారనుకుంటే పక్కన పెట్టి రాజకీయంగా ఏకాకిని చేసి చాలా మానసిక క్షోభకు గురయ్యేలా చేశారు.
కానీ కూతురు కవిత విషయంలో కేసీఆర్ చాలా కటినంగా వ్యవహరిస్తూ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. కానీ ఆ తర్వాత ఆమెను కూడా ఏకాకిగా చేసి రాజకీయాలను తప్పుకునేలా చేయాలనుకున్నారు.
కానీ ఆమె ఒంటరి పోరాటానికి సిద్ధపడటమే కాక కేసీఆర్ పాలనలో అవకతవకలు, బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలను బయటపెడుతూ దాదాపు ప్రతీరోజూ నిలదీస్తున్నారు.
ఆమె కేసీఆర్ కూతురు కావడంతో పార్టీలో ఎవరూ ఆమెకు ఘాటుగా జవాబు చెప్పేందుకు సాహసించడం లేదు. ఆమె కేటీఆర్, హరీష్ రావులిద్దరిపై తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ వారూ సమాధానం చెప్పకుండా మౌనం వహిస్తున్నారు. ఆమె బయటపెడుతున్న అవినీతి, అక్రమాలు, చేస్తున్న విమర్శలతో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట మంట గలిసిపోతోంది.
ధర్మపురి శ్రీనివాస్ విషయంలో అనుసరించిన పద్దతి కవిత విషయంలో పనిచేయదని స్పష్టమవుతోంది. ఆమెను ఏకాకిగా చేసి రాజకీయాల నుంచి తప్పుకునేలా చేయాలని కేసీఆర్ అనుకుంటే, ఆమే వారిపై రోజురోజుకీ ఎదురుదాడులు తీవ్రత పెంచుతూ బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేస్తుండటం విశేషం.
ఆమె పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామని మండలి చైర్మన్ ఇంకా ఆమోదించలేదు. కనుక రేపు (అదివారం) శాసనమండలిలో తనకు మాట్లాడే అవకాశం కల్పిస్తానని మండలి చైర్మన్ హామీ ఇచ్చారని ఆమె నిన్న చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి తన బహిష్కరణకు తెర వెనుక జరిగిన కుట్రలు, వాటిని జరిపించినవారి గురించి రేపు సభలో చెపుతానని కవిత చెప్పారు.
కేసీఆర్ శాసనసభకు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ బ్రతికి బట్ట కట్టడం కష్టం… హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు బబూల్ షూటర్ అంటూ కవిత నిన్ననే సంచలన వ్యాఖ్యలు చేశారు.
కనుక రేపు మరోసారి ఆమె బీఆర్ఎస్ పార్టీపై మరోసారి బాంబుల వర్షం కురిపించడం ఖాయమే. మరి ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మౌనంగా వీడి కవితకి జవాబు చెపుతారా? లేదో?






