నాన్నకు ప్రేమతో కేటీఆర్‌ 18, రేవంత్ రిటర్న్ గిఫ్ట్ 86 మున్సిపాలిటీలు

Congress victory in Telangana municipal elections shocks BRS on KCR birthday

నేడు తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ పుట్టినరోజు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పుట్టిన రోజుని రాష్ట్ర పండగ అనంత ఘనంగా నిర్వహించుకునేవారు బీఆర్ఎస్‌ శ్రేణులు. కానీ మున్సిపల్ ఎన్నికలలో పేలవమైన ప్రదర్శన, ఫలితాలతో పార్టీ శ్రేణులే తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాయి. పార్టీలో కేటీఆర్‌, హరీష్‌ రావు తప్ప పార్టీలో ముఖ్యనేతలు ఎవరూ మున్సిపల్ ఫలితాల గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు.

ఈ ఓటమికి కేటీఆర్‌, హరీష్‌ రావులే పూర్తి బాధ్యత వహించక తప్పదు. ఎందుకంటే, కేసీఆర్‌ పార్టీ బాధ్యతని పూర్తిగా వారిరువురికీ అప్పగించేసి ఫామ్‌హౌసుకి పరిమితమయ్యారు కనుక. కానీ ఈ ఓటమికి కేసీఆర్‌ కూడా సమాన బాధ్యత వహించాల్సిందే.

ADVERTISEMENT

ఎలాగో చూద్దాం. కేసీఆర్‌ ఫామ్‌హౌసు గడప దాటి బయటకు రాకపోయినా ఆయన మార్గదర్శకత్వంలోనే తామందరం పనిచేస్తున్నామని కేటీఆర్‌, హరీష్‌ రావు పదేపదే చెపుతుంటారు. ఒకవేళ ఈ మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీ కనీసం 40-50 మున్సిపాలిటీలు దక్కించుకుని ఉంటే, ఈ పాటికి కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి ‘రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్’ అంటూ ఈ క్రెడిట్ తప్పకుండా తీసుకునేవారు.

కనుక కేసీఆర్‌ ఫామ్‌హౌసులో కూర్చొని ఎన్నికల వ్యూహాలు రచించి, పార్టీ నేతలకు మార్గదర్శనం చేసినా చేయకపోయినా ఈ ఓటమికి ఆయన కూడా బాధ్యులే.

రేవంత్ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. సూపర్ సిక్స్ హామీలు అమలుచేయకుండా మోసం చేస్తున్నారు. కనుక రేవంత్ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది.. అంటూ కేటీఆర్‌, హరీష్‌ రావులు దుష్ప్రచారం చేశారు. ముఖ్యంగా సిఎం రేవంత్ రెడ్డి ‘అసమర్ధుడు’ పరిపాలన చేతకాదు అని గట్టిగా వాదించేవారు.

కేసీఆర్‌ నోట కూడా ఇవే మాటలు వినిపించాయి. కనుక అయన ఇచ్చిన లైన్ ప్రకారమే ‘కృష్ణార్జునులు’ రెచ్చిపోయారని స్పష్టమవుతోంది. కానీ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. అంటే వారి వాదనలు తప్పని… కేసీఆర్‌ వ్యూహాలు బెడిసికొట్టాయని స్పష్టమవుతోంది.

సాధారణంగా మున్సిపల్ ఎన్నికలలో అధికార పార్టీ ఎక్కువ మున్సిపాలిటీలు గెలుచుకోవడం సాధారణ విషయమే. కానీ కేసీఆర్‌ మార్గదర్శనంలో బీఆర్ఎస్‌ పార్టీ అతి, అహం ప్రదర్శించి కాంగ్రెస్‌కు ఘన విజయం కట్టబెట్టింది.

కల్వకుంట్ల కవిత కూడా ఇదే చెప్పారు. కేటీఆర్‌, హరీష్‌ రావుల అసమర్దత, అలసత్వం, వైఫల్యం కారణంగానే కాంగ్రెస్‌ పార్టీకి అన్ని మున్సిపాలిటీలు దక్కాయన్నారు.

కొన్ని ఇంగ్లీషు పదాలలో ఓ సైలంట్ అక్షరం ఉంటుంది. అదేవిధంగా కవిత చెప్పిన ఆ రెండు పేర్ల మద్యలో మరో పేరుంది. అదే కేసీఆర్‌. ఆ పేరు సైలంట్. కానీ ఈ ఓటమి ఆయన కూడా బాధ్యులే అని ఆమె చెప్పకనే చెప్పారు.

నేడు కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా నాన్నకు ప్రేమతో… 116 మున్సిపాలిటీలలో కేవలం 18 గెలిపించి కేటీఆర్‌ కానుకగా ఇస్తే, అసమర్ధుడని కేసీఆర్‌ ముద్ర వేసిన సిఎం రేవంత్ రెడ్డి 86 మున్సిపాలిటీలు గెలుచుకొని మరోసారి తెలంగాణ జాతిపితకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.

తెలంగాణ జాతిపితగా ఎంతో గౌరవంగా రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సిన కేసీఆర్‌, చివరికి ఇలా అవమాన భారంతో ఫామ్‌హౌసులో కుములిపోతూ నిష్క్రమించాల్సి వస్తుందేమో? ఎవరి ఉసురు తగిలిందో.. ఎందరి ఉసురు తగిలిందో పాపం!

ADVERTISEMENT
Latest Stories