తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చాలా పట్టుదలగా ఉన్న బిజెపి ఈసారి తమ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ నగరాన్ని వేదికగా చేసుకొంది. దీంతో దేశం నలుమూలల నుంచి బిజెపి నేతలు తరలివస్తున్నారు.
ఈ సమావేశాల సందర్భంగా వారు సిఎం కేసీఆర్‌ను, కుటుంబపాలన, నిరంకుశత్వ పాలన, అవినీతి అంటూ తీవ్ర విమర్శలు గుప్పించక మానరు. వారికి టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా ధీటుగానే సమాధానాలు చెపుతున్నారు కూడా.
అయితే దేశం నలుమూలల నుంచి వస్తున్న బిజెపి నేతలు తమను విమర్శించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొనేలా టిఆర్ఎస్ అమలుచేస్తున్న వ్యూహం చూస్తే ఎవరైనా ‘వాహ్..వాహ్..’ అనక తప్పదు. ఏవిదంగా అంటే హైదరాబాద్ నగరానికి వస్తున్న బిజెపి నేతలు ప్రయాణించే అన్ని ప్రధాన మార్గాలలో వారికి స్వాగతం పలుకుతూ, సిఎం కేసీఆర్, ఫోటోలతో వివిద రంగాలలో తెలంగాణ రాష్ట్రం ఏవిదంగా అభివృద్ధి చెందిందో కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ దారిపొడవునా ఫ్లెక్సీ బ్యానర్లను ఏర్పాటు చేశారు.
అవన్నీ వాస్తవమే కావడంతో వాటిని ఎవరూ కాదనలేని పరిస్థితి కల్పించింది. వాటిలో ఎక్కడా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రప్రభుత్వం, బిజెపిలను కించపరిచినట్లు లేకపోవడంతో వాటిపై బిజెపి నేతలు ఎవరూ అభ్యంతరం చెప్పలేని పరిస్థితి కల్పించింది.
తమ ప్రభుత్వాన్ని విమర్శించడానికి వస్తున్న బిజెపి నేతలకు టిఆర్ఎస్ స్వాగతం చెపుతూనే, వారికి తమతమ రాష్ట్రాలలో పరిస్థితుల గురించి ఆలోచించుకొనేలా చేసింది. కేసీఆర్ సూచనతో అమలుచేసిన ఈ వ్యూహం చూసి బిజెపి నేతలు నోరు వెళ్ళబెడుతున్నారు పాపం!
దారి పొడవునా ఏర్పాటు చేసిన కొన్ని బ్యానర్లలో ఈవిదంగా ఉన్నాయి:
· అన్ని రంగాలలో స్వయంసంవృద్ధి సాధించి దేశ ఆర్ధిక వ్యవస్థకు తోడ్పడుతున్న రాష్ట్రం తెలంగాణ.
· తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోకెల్ల అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది.
· తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద స్టార్టప్, ఇన్నోవేషన్ కేంద్రం (టీ-హబ్) హైదరాబాద్‌లో నిర్మించింది.
· జాతీయ స్థాయిలో కేంద్రప్రభుత్వం ప్రకటించిన 20 అత్యుత్తమ గ్రామాలలో 19 తెలంగాణకు చెందినవే.
· ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్: 1
· తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నంబర్: 1
· ఐటి సంస్థల ఏర్పాటు, ఐటి సేవల ఎగుమతులలో దేశంలో తెలంగాణ రాష్ట్రం నంబర్: 2 స్థానంలో ఉంది
· విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ.
· రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ.
· సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్: 4 స్థానంలో ఉంది.
· దేశంలో అత్యధిక వృద్ధిరేటు సాధించిన రాష్ట్రం తెలంగాణ.
· దేశంలో ప్రజారోగ్య రంగంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ.



