‘వైయస్’ నియంత పాలనను గుర్తు చేస్తున్న ‘కేసీఆర్’

kcr reminding ys rajashekhar reddy2004లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి అనుసరించిన ‘రాజకీయ వ్యూహం’ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేసింది. ప్రత్యర్ధి పార్టీ నాయకులు, కార్యకర్తల ‘రక్తం’తో తొలి మూడు సంవత్సరాలు నిండిపోగా, అప్పటినుండి ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరుతో ఇతర పార్టీ నేతలందరినీ కాంగ్రెస్ ఖాతాలో వేయడం ప్రారంభించారు. ఒకానొక దశలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగు దేశం పూర్తిగా ఖాళీ అయిపోతుందన్న ఊహాగానాలు వినిపించాయి. అలా 2009లో మళ్ళీ కాంగ్రెస్ ను అధికార పీటం ఎక్కించి, మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆ తర్వాత కొద్ది మాసాలకే ‘వైయస్’ అస్తమయం కావడంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది.

అలా 2004 నుండి 2009 వరకు ముఖ్యమంత్రి హోదాలో వైయస్ ఓ విధమైన ‘నియంత’ పాలనను అందించారని, తనకు ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనేది వైయస్ ప్రధాన అజెండాగా మారిపోయిందని విశ్లేషకులు ఇప్పటికీ చెప్తుంటారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ వర్గాలు సైతం అంగీకరిస్తాయి. అయితే అయిదేళ్ల పాటు అంతలా వెలిగిపోయిన వైయస్ దుర్మరణం చాలా మంది ప్రజలను కలచివేసింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన రాజకీయ పరిస్థితులు గురించి అందరికీ తెలిసిందే.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఆనాటి వైయస్ పాలనను తలపిస్తున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తనకు ఎదురు వచ్చిన వారిని వైయస్ మాదిరే నాయనో, భయానో లోబర్చుకోవడం కేసీఆర్ కు పరిపాటిగా మారిందని.., గడిచిన 17 మాసాల పాలన ఇందుకు నిదర్శనమని.., కేసీఆర్ ప్రతి అడుగులో వైయస్ రాజకీయం కనపడుతోందని పొలిటికల్ వర్గాల టాక్. ఆఖరికి మీడియాపై నియంత్రణ, తనకు కొరకరాని కొయ్యగా మారిన రేవంత్ రెడ్డిని కేసుల్లో ఇరికించడం వంటి చర్యలతో పాటు, తెలంగాణాలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ చూపుతున్న ఉత్సుకత ఆనాటి ‘వైయస్’ను గుర్తుకు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

దాదాపు అయిదున్నర్రేళ్ళ పాటు కొనసాగిన వైయస్ ‘దూకుడు’కు ‘విధి’ బ్రేక్ వేసింది. తొలి అయిదు సంవత్సరాలకు గానూ తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న కేసీఆర్ పాలనకు 2019లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో తేలిన దాన్ని బట్టి, కేసీఆర్ ‘దూకుడు’ను నిర్ణయించవచ్చు. 2004 ఎన్నికలలో వైయస్ కు మిత్రపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్, బహుశా ఆ సందర్భంలోనే వైయస్ రాజకీయ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారేమో..!

ADVERTISEMENT
Latest Stories