తమిళ దర్శకుడు మురుగదాస్ – ప్రిన్స్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కబోతున్న త్రిభాషా చిత్రం కోసం హీరోయిన్ ఎంపిక గత రెండు, మూడు మాసాలుగా జరుగుతోంది. బాలీవుడ్ భామల పేర్లతో పాటు టాలీవుడ్, కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ల పేర్లు హల్చల్ చేయగా, చివరికి ఆ అవకాశం ‘నేను.. శైలజ…’ హీరోయిన్ కీర్తి సురేష్ ను వరించిందని టాక్.
ఇప్పుడిప్పుడే క్రేజీ హీరోయిన్ గా అవతరిస్తున్న ఈ ముద్దుగుమ్మకు నిజంగా ఇది బంపర్ ఆఫర్ లాంటిదేనని చెప్పాలి. ఒక రకంగా ‘దేవదాస్’తో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ‘పోకిరి’తో తన దశను తిప్పుకున్న ఇలియానా మాదిరి కీర్తి సురేష్ కెరీర్ మారే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు.
దాదాపు 90 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందించనుండగా, ఏప్రిల్ రెండవ వారంలో లాంఛనంగా ప్రారంభం జరుపుకోనుంది. కీర్తి ఎంపిక విషయాన్ని దర్శకుడు మురుగదాస్ పరోక్షంగా కోలీవుడ్ వర్గాలకు తెలిపినట్లుగా సమాచారం.





