ఏపీలో విశాఖపట్నం అంటే అందమైన బీచ్‌లు, వాటి పక్కనే పచ్చటి చెట్లతో నిండిన కొండలు, ప్రకృతి అందాలు, అనేక పుణ్యక్షేత్రాలు అనే గుర్తింపు ఉంది. స్టీల్ ప్లాంట్‌తో సహా అనేక పరిశ్రమలు, షిప్‌యార్డ్, డాక్ యార్డ్, వాణిజ్య పోర్ట్, తాజాగా భోగాపురం వద్ద త్వరలో ప్రారంభం కాబోతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి విశాఖపట్నంకి గుర్తింపునిస్తున్నాయి.
ఈ రెండేళ్ళలోనే అనేక ఐటి కంపెనీలు, పరిశ్రమలు తరలివస్తుండటంతో విశాఖ మెట్రో నగరంగా మారుతోంది. ఎక్కడికక్కడ నిర్మితమవుతున్న బహుళ అంతస్తుల భవనాలతో నగరం రూపురేఖలు చాలా వేగంగా మారిపోతున్నాయిప్పుడు.
ఇప్పటికే విశాఖలో హై రైజ్ అపార్ట్‌మెంట్‌ల నిర్మాణాలు కొన్ని జరిగాయి. వాటిలో సీతమ్మధారలో 35 అంతస్తుల ఆక్సిజన్ టవర్స్ ఒకటి. ఇప్పుడు దాని రికార్డుని పెద్ద రుషికొండలో ఎంకే బిల్డర్స్ నిర్మించబోతున్న జీ ప్లస్ 54 అంతస్తుల హై రైజ్ అపార్ట్‌మెంట్ బ్రేక్ చేయబోతోంది.
రూ.1,835 కోట్ల పెట్టుబడితో మొత్తం 6.39 లక్షల చదరపు మీటర్ల నిర్మాణ విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నాలుగు హైరైజ్ టవర్లను ఎంకే బిల్డర్స్ నిర్మించనుంది. వీటిలో 1,359 ప్రీమియం లగ్జరీ ఫ్లాట్లు ఉంటాయి. ఇటీవలే ఈ ప్రాజెక్టుకి జీవీఎంసీ అనుమతి మంజూరు చేసినట్లు తెలుస్తోంది.
ఇది మరో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు మాత్రమే కాదు. విశాఖ భవిష్యత్ అభివృద్ధికి ప్రతీకగా కూడా దీనిని చూడొచ్చు. ఇలాంటి భారీ ప్రాజెక్టులు వస్తున్నాయంటే విశాఖపై ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు గురి కుదిరిందని భావించవచ్చు.
ఇప్పటికే హైదరాబాద్‌లో 70కిపైగా అంతస్తులతో అనేక ఆకాశహర్మ్యాలు నిర్మాణ దశలో ఉన్నాయి. విశాఖ నగరం ఇంకా ఆ స్థాయికి చేరుకోకపోయినా, ఇప్పుడు 54 అంతస్తులతో హైదరాబాద్‌తో పోటీకి సై అంటున్నట్లే భావించవచ్చు.






