రండి తలో చెయ్యేసి రాహుల్‌ని ప్రధాని చేసుకుందాం!

Rahul Gandhi PM

ఏంటీ… మనం చెయ్యేస్తేనే రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రి అవుతారా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి.

నిన్న మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌లో జరిగిన సభలో ప్రజలను ఉద్దేశ్యించి, “దేశానికి రాహుల్‌ నాయకత్వం ఓ చారిత్రిక అవసరం. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞతగా రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసుకుందాం. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసేందుకు నా ప్రయత్నాలలో మీ అందరి తోడ్పాటు కావాలి,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ADVERTISEMENT

కాంగ్రెస్‌ లేదా మరే పార్టీలో అయినా సరే నాయకులు అధిష్టానం భజన చేయాల్సిందే. చేస్తూ తమ విధేయత నిరూపించుకోవాల్సిందే. లేకుంటే ప్రమాదం. సిఎం రేవంత్ రెడ్డి అదే ఆలోచనతో ఈ మాట అన్నారేమో తెలీదు.

కానీ 140 కోట్లకు పైగా జనాభా ఉన్న సువిశాలమైన ఈ దేశాన్ని పాలించాలంటే రాహుల్‌ గాంధీతో సహా ఎవరైనా సరే తాము అందుకు సమర్దులమే అని స్వయంగా నిరూపించుకోగలగాలి.

దివంగత ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు ఆవిధంగానే తమ శక్తిసామర్ధ్యాలు, నాయకత్వ లక్షణాలను ఎన్నికలనే అగ్నిపరీక్షకు గురిచేసి నిరూపించుకొని ప్రధాని పదవి చేపట్టారు.

రాహుల్‌ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెడదామని చెప్తున్న రేవంత్ రెడ్డి కూడా ఇలాగే తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకొని సిఎం అయ్యారు.

దేశంలో రాష్ట్రాలలో ఇంకా చాలా మంది ఇలాంటి నాయకులున్నారు. వారెవరూ తమని వేరెవరో అధికార పీఠంపై కూర్చోబెట్టాలని ఆశించలేదు.

కనుక రాహుల్‌ గాంధీ కూడా తన స్వశక్తితో ప్రధాని పదవి సాధించుకోవడమే ఆయనకు, కాంగ్రెస్‌ పార్టీ, దేశానికి కూడా గౌరవప్రదంగా ఉంటుంది.

మరో ముఖ్య విషయం ఏమిటంటే, సిఎం రేవంత్ రెడ్డితో సహా దేశంలో కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ గురించి ఈవిధంగా మాట్లాడకుండా ఉంటేనే ఆయనకీ, వారికీ కూడా గౌరవంగా ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories