ఇండియన్ బాక్సాఫీస్ పై “బాహుబలి 2” సునామీలా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దెబ్బకు ఇతర సినిమాలు విడుదలయ్యాయో లేదో కూడా ప్రేక్షకులు పట్టించుకోవడం మానేసారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల విడుదలైన ‘బాబు బాగా బిజీ’ పత్తా లేకుండా పోగా, ఈ నెల 12వ తేదీ నాడు మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి. అయితే వీటిల్లో ‘బాహుబలి 2’ని తట్టుకుని ఎన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తాయో చెప్పలేం.
కానీ, ఈ నెల 19న విడుదల కాబోయే “కేశవ” మాత్రం ‘బాహుబలి 2’కు ఎదురు నిలిచేలా కనపడుతోంది. నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా అంత నమ్మకాన్ని ప్రేక్షకులకు కలిగించడంలో సక్సెస్ సాధిస్తోంది. ఫస్ట్ పోస్టర్ దగ్గర నుండి ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రతి అంశంపై కూడా సినీ అభిమానుల దగ్గర నుండి పాజిటివ్ రియాక్షన్స్ తెచ్చుకోవడంతోనే… ఈ నమ్మకం అంతకంతకూ బలపడుతోంది. ఆసక్తికరంగా కట్ చేసిన టీజర్ కు తోడు, తాజాగా విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడం విశేషం.
‘కాలభైరవ అక్షతం’ అంటూ సాగే ఈ పాటలో లిరిక్స్ మాంచి ఊపు తెప్పించే విధంగా శ్రోతలను అలరిస్తున్నాయి. సన్నీ సంగీతం అందించిన ఈ పాటను హర్షిక గుడి, సత్య యామిని తదితరులు ఆలపించారు. శ్లోకాలతో కూడిన ఈ పాటకు వచ్చిన స్పందనతో, ‘కేశవ’ సినిమాపై బజ్ మరింతగా పెరిగింది. దీంతో ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్ కూడా ఆడియన్స్ ను అలరిస్తే, ఓపెనింగ్స్ నిఖిల్ కెరీర్ లోనే ది బెస్ట్ గా వచ్చే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.



