ఇకపై టెంప్లేట్‌కు దూరంగా సినిమాలు : కోన

Kona-Venkat-nikhil‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’, ‘పండగ చేస్కో’ తాజాగా వచ్చిన ‘బ్రూస్‌లీ’ ఇలా పలు చిత్రాలకు ఒకే రకమైన కథలను అందించిన రచయితలు కోన వెంకట్‌, గోపీ మోహన్‌. రొటీన్‌ కథలు అనే ముద్ర పడ్డా కూడా తప్పని పరిస్థితుల్లో అదే టెంప్లేట్‌తో ఈ రచయితలు కథలను అందిస్తున్నారు. ఇలాంటి కథలు కొన్ని సక్సెస్‌ అవుతుండగా, మరి కొన్ని ఫ్లాప్‌ అయ్యాయి. అయినా కూడా దర్శకులు, నిర్మాతలు ఇలాంటి టెంప్లేట్‌ కథలే కావాలంటూ తమ వద్దకు వస్తున్నారని రచయిత కోన వెంకట్‌ అంటున్నాడు. ఎన్నో కొత్త కథలు ఉన్నా కూడా ఆ టెంప్లేట్‌తోనే కథ రాయాల్సిందిగా ఒత్తిడి చేయడంతో తప్పని సరి పరిస్థితుల్లో రాయాల్సి వచ్చింది అంటూ కోన చెప్పుకొచ్చాడు.

ఈ టెంప్లేట్‌కు దూరంగా తాను రాసిన కథలతో తెరకెక్కిన చిత్రాలే ‘గీతాంజలి’, ‘శంకరాభరణం’. ఇప్పటికే ‘గీతాంజలి’ సక్సెస్‌ అవ్వగా ‘శంకరాభరణం’ ఈవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై కూడా చాలా ఆశలు, అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత కోన వెంకట్‌ టెంప్లేట్‌ స్టోరీలకు స్వస్థి చెప్తాడట. తన కథలతో తానే సినిమాలు తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాను అని, తన కొత్త కథలు స్టార్‌ హీరోలకు నచ్చకుంటే చిన్న హీరోలతో సినిమాలు చేస్తాను అని కోన వెంకట్‌ అంటున్నాడు. స్టార్‌ హీరోలు ఇమేజ్‌ను పక్కకు పెట్టి వైవిధ్యభరిత కథాంశాల్లో నటించాల్సిందిగా కోన కోరుతున్నాడు. మరి కోన పిలుపుకు ఎంత మంది హీరోలు మారుతారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories