వైవిధ్య చిత్రాల దర్శకుడిగా పేరున్న క్రిష్ తాజాగా తన సొంత నిర్మాణ సంస్థలో ‘రాయబారి’ అనే టైటిల్‌ను రిజిస్ట్రర్ చేయించాడు. దాంతో అప్పటి నుండి కూడా ఈ సినిమాను క్రిష్ ఎవరి దర్శకత్వంలో తెరకెక్కిస్తాడా అంటూ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట ఈ టైటిల్‌తో అఖిల్ హీరోగా క్రిష్ సినిమా చేస్తాడని అనుకున్నారు. ఆ మధ్య నాగార్జున స్వయంగా తన కొడుకు అఖిల్‌తో ఒక సినిమా చేయాల్సిందిగా కోరడంతో క్రిష్ ఈ సినిమా చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా ‘రాయబారి’ ఎవరు అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది.
మెగా హీరో వరుణ్ తేజ్‌ను ‘రాయబారి’గా మార్చాలని క్రిష్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ‘కంచె’ చిత్రం వచ్చి విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్స్‌ను కూడా రాబట్టిన విషయం తెల్సిందే. ‘కంచె’ సమయంలో వరుణ్ తేజ్ సినిమా కోసం పడే కష్టం క్రిష్‌కు నచ్చింది. దాంతో మరోసారి వరుణ్ తేజ్‌తో సినిమా చేస్తాను అంటూ ఆడియో విడుదల సమయంలోనే చెప్పాడు. అప్పుడు చెప్పినట్లుగానే వెంటనే ఈ సినిమాను చేయబోతున్నాడు. ప్రస్తుతం ‘లోఫర్’ సినిమాతో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ ఆ తర్వాత ‘ఫీల్ మై లవ్’ అనే చిత్రాన్ని దిల్‌రాజు నిర్మాణంలో చేయబోతున్నాడు. ఆ తర్వాత అంటే వచ్చే సంవత్సరం వేసవిలో క్రిష్, వరుణ్‌ల సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. వచ్చే సంవత్సరం చివర్లోనే ‘రాయబారి’ని ప్రేక్షకుల ముందు నిలుపాలని క్రిష్ భావిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో నటించాలని స్టార్స్ కూడా కోరుకుంటుండగా, వరుణ్‌కు మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి.





