ప్రాంతీయ పార్టీలే మంచిదట… మరి బిఆర్ఎస్ కధేమిటి?

ktr-brs-maharashtra-elections-2024

కేసీఆర్‌ ప్రధాన మంత్రి కావాలనుకున్నారు కానీ మళ్ళీ ముఖ్యమంత్రి కూడా కాలేకపోయారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడో శక్తిగా ఎదగాలనే ఆలోచనతో ఆ రెండు పార్టీలను శత్రువులుగా ప్రకటించడంతో వాటి మిత్రపక్షాలైన ప్రాంతీయ పార్టీలన్నీ ఆయన దూరం చేసుకోవడంతో ఒంటరిగా మిగిలిపోయారు. ప్రస్తుతం మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతున్నా కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ గడప దాటడం లేదు.

ఇదివరకు తెలంగాణలో కాంగ్రెస్‌ని నిర్వీర్యం చేయడంతో బీజేపీ బలపడింది. కనుక కేసీఆర్‌ దానికి చెక్ పెట్టేందుకు, పనిలో పనిగా తనని తాను జాతీయస్థాయి నాయకుడుగా ప్రమోట్ చేసుకునేందుకు ప్రధాని నరేంద్రమోడీపై యుద్ధం ప్రకటించి కత్తులు దూశారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్‌తో యుద్ధం అనివార్యమైంది.

ADVERTISEMENT

ఈ కధ అంతా అందరికీ తెలిసిందే. అయితే కేసీఆర్‌ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన కూతురు కల్వకుంట్ల కవితని విడిపించుకునేందుకు తాను ఎవరిని గద్దె దించుతానని శపధాలు చేశారో వారితోనే రాజీ పడాల్సివచ్చిందని అందరికీ తెలుసు.

తాజాగా ఫార్ములా-1 రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌ రూ.55 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ తెలంగాణ ప్రభుత్వం ఆయనని అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కనుక ఈ కేసు నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ పెద్దల కాళ్ళ మీద పడేందుకు వెళ్ళారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

అంటే నేటికీ బిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రధాని నరేంద్రమోడీ సాయం పొందుతున్నారు లేదా ఆశిస్తున్నారన్న మాట!

ఓ పక్క మోడీ సాయం ఆశిస్తూనే కేటీఆర్‌ మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలకు ఓట్లు వేయవద్దని విజ్ఞప్తి చేయడం విశేషం!

ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఓట్లు వేసి గెలిపించుకోవాలని కేటీఆర్‌ సూచించారు. అయితే మహారాష్ట్రలో ప్రధాన ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ లేదా బీజేపీలతో కలిసి సాగుతున్న సంగతి కేటీఆర్‌కు తెలుసో తెలియదో?

కేసీఆర్‌ తన జాతీయ రాజకీయాల కోసం టిఆర్ఎస్ పేరుని బిఆర్ఎస్ పార్టీగా మార్చగా ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. అది వేరే విషయం.

కానీ పార్టీ పేరు మార్చుకున్నప్పటికీ వారి ఆలోచనలు మాత్రం ప్రాంతీయ పార్టీ స్థాయిలోనే ఉన్నాయని కేటీఆర్‌ మాటలతో స్పష్టం అయ్యింది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండాలని సుద్దులు చెపుతున్న కేటీఆర్‌, 2019 ఏపీ శాసనసభ ఎన్నికలలో చంద్రబాబు నాయుడుని ఓడగొట్టేందుకు తన తండ్రి కేసీఆర్‌ తెర వెనుక చక్రం తిప్పిన విషయం కూడా మరిచిన్నట్లున్నారు. అంటే పదవి, అధికారంపై ఉన్న స్పష్ఠత పార్టీ విధానంపై లేదనుకోవాలా?

ADVERTISEMENT
Latest Stories