గోడకు తగిలించిన తుపాకీ కేసీఆర్‌!!!

KTR defending KCR’s silence with ‘hanging gun’ analogy during media meet

రాజకీయాలలో ఉన్నవారు నిత్యం మీడియా, ప్రజల మద్య తప్పనిసరిగా ఉండాలి. ఉంటారు. కానీ తెలంగాణలో ఆ మాటకొస్తే… జాతీయ స్థాయిలోనే తనకు తిరుగేలేదనుకున్న కేసీఆర్‌, సొంత గడ్డపై ఘోరంగా ఓడిపోయారు. అప్పటి నుంచి ఫామ్‌హౌసులోనే కాలక్షేపం చేస్తున్నారు.

పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, కేసులు, విచారణలు, కవిత బహిష్కరణ, హరీష్ రావుపై ఆమె తీవ్ర విమర్శలు, జూబ్లీహిల్స్‌లో ఓటమి… ఏం జరుగుతున్నా అయన బయటకు రావడం లేదు.

ADVERTISEMENT

కనీసం జగన్‌లాగ ఫామ్‌హౌసులో రోజూ మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడటం లేదు. అప్పటి నుంచి కేటీఆరే బీఆర్ఎస్‌ పార్టీని నడిపిస్తున్నారు. ఆయనకు తోడుగా హరీష్ రావు ఉంటున్నారు. కనుక కేసీఆర్‌ ఇక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్లే అని అందరూ భావిస్తున్నారు.

నాడు తెలంగాణ కోసం కేసీఆర్‌ సైలైన్లు పెట్టుకొని ఆమరణ నిరాహార దీక్ష చేసిన రోజు అంటే ‘దీక్షా దివస్’ నేడు. ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం పెట్టి కేసీఆర్‌ గురించి పంచ్ డైలాగులు చెప్పారు. అవి పంచ్ డైలాగులు కనుక బాగానే పేలాయి.

ఇంతకీ కేటీఆర్‌ ఏమన్నారంటే, “కేసీఆర్‌ ఫామ్‌హౌసులో నుంచి బయటకు రావడం లేదని, ఎవరితో మాట్లాడటం లేదని ఆయన పని అయిపోయిందని కొందరు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్‌ గోడకు వ్రేలాదదీసిన తుపాకీ లాంటివారు. తుపాకీ అన్నాక ఏదో రోజు పేలకుండా ఉండదు. ఆయన కూడా సరైన సమయంలో బయటకు వస్తారు. అప్పుడు ఆ తుపాకీ పేలుతుంది. కేసీఆర్‌ మాట్లాడినా సంచలనమే మాట్లాడకపోయినా సంచలనమే,” అని కేటీఆర్‌ అన్నారు.

ఈ డైలాగులు వినడానికి చాలా బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే సినిమాలో హీరోకి ఎలివేషన్స్ ఇస్తున్నట్లున్నాయి. గోడకున్న తుపాకీ అయినా అప్పుడప్పుడు తీసి వాడుతూ ఉండాలి. లేకుంటే తుప్పట్టిపోతుంది. అలంకారప్రాయంగా మిగిలిపోతుంది. కేసీఆర్‌కి ఇదే రూల్ వర్తిస్తుంది.

పదవీ, అధికారం ఉంటేనే ప్రజలకు మొహం చూపిస్తాను… మాట్లాడుతాను లేకుంటే లేదంటే అలాంటి నాయకులు ప్రజలకు అవసరం ఉండదు.

పెద్ద హీరో సినిమా ఫలానా రోజున విడుదలవుతుందని చెపితే సరిపోదు. ఎంత పెద్ద హీరో అయినా ఫస్ట్ లుక్ పోస్టర్‌, ఫస్ట్ గ్లిమ్స్‌, పాటలు, టీజర్‌, ట్రైలర్‌, ప్రమోషన్స్‌ చూపిస్తూ జనాలను ఊరిస్తూనే ఉండాలి. అప్పుడయినా ఆ సినిమాలో సత్తా ఉంటేనే హిట్ అవుతుంది. లేకుంటే ఫ్లాప్.

కానీ బాహుబలి వంటి కేసీఆర్‌కి ఇలాంటి ప్రమోషన్స్‌ ఏవీ అవసరం లేదని, ఎప్పుడు వచ్చినా బొమ్మ సూపర్ హిట్ అవుతుందని కేటీఆర్‌ చెపుతున్నారు. అవునో కాదో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories