కేటీఆర్ కష్టాల్లో… హరీష్ రైజింగ్?

KTR facing F1 case pressure and potential power shift toward Harish Rao in BRS

కాగల కార్యం గంధర్వులే చేసినట్లు అని వింటాము కానీ అదేమిటో నేటి తరానికి తెలియకపోవచ్చు. కనుక పురాణాలు చెపితే కుదరదు… కనుక ఓ మూడు ఉదాహరణలు చెప్పుకుందాం.

ఉదా 1: చంద్రబాబు నాయుడు ఇదివరకు ప్రధాని మోడీపై కత్తులు దూశారు. అప్పుడు కేసీఆర్‌, జగన్‌ చేతులు కలిపారు. మోడీ కలుగజేసుకోలేదు, వాళ్ళిద్దరూ కలిసి ఆయనని గద్దె దించేశారు. కాగల కార్యం కేసీఆర్‌, జగన్‌ చేసేశారన్న మాట!

ADVERTISEMENT

ఉదా 2: చంద్రబాబు నాయుడుని జగన్‌ జైల్లో పెట్టారు. మోడీ కలుగజేసుకోలేదు. పాత కోపమే కారణం. ఆయన చేతికి మట్టి అంటకుండా జగన్‌ కానిచ్చేశారు. అలా కాగల కార్యం జగన్‌ చేశారన్న మాట!

ఉదా 3: ఎఫ్‌-1 రేసింగ్ కేసులో కేటీఆర్‌ని ప్రాసిక్యూట్ చేసేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఒకవేళ ఈ కేసులో కేటీఆర్‌ అరెస్ట్‌ అయ్యి జైలుకి వెళితే బీఆర్ఎస్‌ పార్టీ హరీష్ రావు చేతికి వస్తుంది. కాగల కార్యం గవర్నర్ చేశారన్న మాట!

ఇప్పుడు చరిత్ర పాఠాలొద్దు. వర్తమానంలోకి వస్తే, కేటీఆర్‌ కంటే హరీష్ రావు చాలా సీనియర్. మంచి రాజకీయ అనుభవం ఉంది. ట్రబుల్ షూటర్ అని మంచి పేరుంది. కానీ బీఆర్ఎస్‌ పార్టీలో వారసత్వ హక్కు ప్రకారం కేసీఆర్‌ తర్వాత కేటీఆరే ఆ పార్టీ పగ్గాలు చేపడతారు. అదృష్టం కలిసి వస్తే ముఖ్యమంత్రి కూడా అవుతారు. కనుక హరీష్ రావు ఎప్పటికీ భల్లాల దేవుడిలా ఆయన పక్క సీట్లో సర్దుకుపోవలసిందే.

కానీ పార్టీ నుంచి బహిష్కరించబడిన కల్వకుంట్ల కవితకే ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక ఉన్నప్పుడు, హరీష్ రావుకి ఉండదా? ఆయన కూడా ఉప్పు, కారం తినే మనిషే. కనుక పార్టీ పగ్గాలు చేపట్టాలని, ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవడం సహజం.

కానీ కేటీఆర్‌ ఉన్నంత వరకు అది సాధ్యం కాదు. కానీ ఎఫ్‌-1 రేసింగ్ కేసులో కేటీఆర్‌ జైలుకి వెళితే… అప్పటికీ కేసీఆర్‌ ఫామ్‌హౌసులో నుంచి బయటకు రాకపోతే… పార్టీ పగ్గాలు ఆటోమేటిక్‌గా హరీష్ రావు చేతికే వస్తాయి.

బీఆర్ఎస్‌లో కట్టప్ప పాత్ర పోషిస్తున్నవాడు హరీష్ రావేనని కవిత ఆరోపించిన సంగతి తెలిసిందే. కనుక కాగల కార్యం కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తి చేస్తే హరీష్ రావుకి మేలు కలుగుతుందేమో?

ఇలా అంటే కేసీఆర్‌, కేటీఆర్‌, బీఆర్ఎస్‌ పార్టీ నేతలకి, హరీష్ రావుకి కూడా కోపం రావచ్చు. కానీ ఎఫ్‌-1 రేసింగ్ కేసులో కేటీఆర్‌ ఫిక్స్ అయిపోతే ఇదే జరుగవచ్చు.

ADVERTISEMENT
Latest Stories