సినీ పరిజ్ఞానం ఉన్న వారికి “శరణం గచ్ఛామి” అనే టైటిల్ వినగానే, విడుదల అవ్వని సినిమాగా ముద్ర పడిపోయింది. కులాలు, రిజర్వేషన్లను ప్రామాణికంగా తీసుకుని తయారు చేసుకున్న కధాంశం కావడంతో… రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని ఏకంగా సెన్సార్ బోర్డు ఈ సినిమాను తిరస్కరించగా, రివైజింగ్ కమిటీకి వెళ్ళిన తర్వాత 9 మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ సినిమాను చూసి ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను మంజూరు చేయడం, ఈ సినిమాను వార్తల్లో నిలిపేలా చేసింది.
ఇంతగా హాట్ హాట్ గా హల్చల్ చేసిన ఈ సినిమాకు… తాజాగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి అయిన కేటీఆర్ అండదండలు పుష్కలంగా ఉండడం విశేషం. ఆదివారం నాడు ఈ సినిమా ఆడియోను విడుదల చేసిన కేటీఆర్, చిత్ర దర్శకుడితో తన అనుబంధాన్ని వివరిస్తూ, సినిమాపై వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ పరంగా ఈ సినిమాకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలో, వాటన్నింటిని సమకూరుస్తామని సబ్సిడీ గానీ, వినోదపు పన్ను రాయితీలు గానీ తానూ వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుని చేసి పెడతానని హామీ ఇచ్చారు.
ఇదంతా కూడా “శరణం గచ్ఛామి” సినిమా దర్శకుడు ప్రేమ రాజ్ తో ఉన్న అనుబంధం వలనేనని, అధికారంలో ఉన్నపుడు సహజంగా చుట్టాలు పెరుగుతారు, కానీ కష్టాల్లో ఉండి కూడా ఎన్నడూ తన వద్దకు ప్రేమ్ రాజ్ రాలేదని, అదే ఆయన వ్యక్తిత్వాన్ని చాటిచెప్తుందని కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే సామాజిక స్పృహతో తను ఎంచుకున్న సబ్జెక్ట్స్ చాలా గొప్పగా ఉంటాయని చెప్పిన కేటీఆర్, ఈ సినిమాకు కావాల్సినన్ని ధియేటర్లు అందుబాటులో ఉండేలా చూస్తానని కూడా చెప్పడం కూడా విశేషం.
మొన్నటివరకు అసలు విడుదల అవుతుందో, లేదో కూడా తెలియని సినిమాగా మారిన “శరణం గచ్ఛామి”కి, ఇపుడు ఏకంగా సిఎం తర్వాత సిఎం స్థాయి వ్యక్తిగా భావించే కేటీఆర్ ఆశీర్వాదాలు లభించడంతో… అది చిన్న సినిమాగా కాకుండా ఓ పెద్ద సినిమాగా మారినంత పనిచేసింది. దీంతో ‘శరణం గచ్ఛామి’ విడుదలకు ఉన్న అడ్డులన్నీ తొలగినట్లే భావించవచ్చు. అలాగే విడుదల తర్వాత ఎంతటి సంచలనంగా నిలుస్తుందో చూడాలి. ఎందుకంటే కులాలను – రాజకీయాలను – వివాదాలను వేరువేరు చేసి చూడలేం గనుక!



