అధికారంలో ఉండటమే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అని చాలా మంది నేతలు అనుకుంటారు. అందుకే తాము ఏం చేస్తుస్తే అదే ప్రజాస్వామ్యం… అదే రాజ్యాంగం అనుకుంటారు.
తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ కూడా అలాగే వ్యవహరించారు. కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు ఆయనకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తురాలేదు.
కానీ తన ఎమ్మెల్యే ఒకరిని బీజేపీ ఎత్తుకుపోబోతే ముందే పసిగట్టిన కేసీఆర్ మరో ముగ్గురిని కూడా కలిపి పంపించి వల వేసి ముగ్గురు బీజేపీ నేతలను పట్టుకుని జైల్లో పెట్టారు. ప్రధాని మోడీ తన ప్రభుత్వాన్ని కూలద్రోసి ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని ఖూనీ చేసేస్తున్నారంటూ నాడు కేసీఆర్ గగ్గోలు పెట్టారు.
మళ్ళీ అదే కేసీఆర్, ఎప్పుడో డా.అంబేడ్కర్ వ్రాసిన ఈ రాజ్యాంగం ఇప్పుడు పనికిరాదు… మళ్ళీ కొత్త రాజ్యాంగం వ్రాసుకోవలసిందే, అని ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. ఒకవేళ కేసీఆర్ యాగాలు, వాస్తు, జాతకాలు ఫలించి ప్రధాన మంత్రి అయితే భారతదేశానికి గులాబీ రాజ్యాంగం అందించేవారే. కానీ ఆయన దురదృష్టం ప్రజల దురదృష్టం!
కేసీఆర్‌కు అధికారంలో ఉండగా గుర్తురాని ప్రజాస్వామ్యం, పనికిరాని రాజ్యాంగం మళ్ళీ ఇప్పుడు అవసరం పడ్డాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటిని ఖూనీ చేసేస్తోందని కనుక వాటిని కాపాడాలంటూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలను వెంటపెట్టుకొని తెలంగాణ గవర్నర్ సీపి రాధాకృష్ణన్‌ని కలిసి వినతి పత్రం ఇచ్చి వచ్చారు.
రేవంత్ రెడ్డి తమ ఎమ్మెల్యేలని భయపెట్టి ఎత్తుకుపోతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేస్తున్నారని గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు.
గవర్నర్ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడితే, అవి తమ బిఆర్ఎస్ పార్టీని కాపాడుతాయని కేటీఆర్ భావిస్తున్నారన్న మాట! భలే ఉంది కదా?







