తెలంగాణలో ఇప్పతికిప్పు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ఇదే చెబుతున్నాయని, వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కనీసం 78 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, కనుక ప్రజలు మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారన్నారు.
పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి జరిగిందనేది కళ్ళకు కనిపిస్తున్న వాస్తవం. కానీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆ స్థాయిలో కాకపోయినా 50 శాతం కూడా ఆభివృద్ధి చూపలేకపోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
కనుక ప్రజలు కేసీఆర్, రేవంత్ రెడ్డి పాలనలు పోల్చి చూసుకుంటూ రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ పాలనే బాగుందని భావిస్తున్నారని కేటీఆర్ అభిప్రాయంగా కనిపిస్తోంది. కనుక బీఆర్ఎస్ పార్టీ సొంత బలం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపైనే తమ విజయం ఆధారపడినట్లుగా కేటీఆర్ భావిస్తునట్లనిపిస్తుంది.
కానీ తెలంగాణలో కేసీఆర్‌ని కొట్టే మొనగాడు పుట్టనే లేదని విర్రవీగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున బాహుబలిలా రంగప్రవేశం చేసిన రేవంత్ రెడ్డి, అంత గొప్ప రాజకీయ చాణక్యుడిని ఒంటి చేత్తో ఓడించడం మామూలు విషయం కానే కాదు.
ముఖ్యంగా ఎన్నికల వ్యూహాలు రచించడంలో కేసీఆర్‌కు ఏమాత్రం తీసిపోరని రేవంత్ రెడ్డి నిరూపించుకున్నారు. ఆ తర్వాత ఈ రెండేళ్ళలో జరిగిన ప్రతీ ఎన్నికలలో నిరూపించుకుంటూనే ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి శక్తియుక్తులను నేటికీ కేటీఆర్ తక్కువ అంచనా వేస్తూ అయన గురించి చాలా చులకనగా మాట్లాడుతున్నారు.
కేసీఆర్ రెండున్నరేళ్లుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమవడం వలన అయన ఇక రాజకీయాలలో పాల్గోనలేరనే తప్పుడు సంకేతాలు ప్రజలకు వెళ్తున్నాయి. ఆ పరిస్థితిలో ఉన్న కేసీఆర్‌ని ప్రజలు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని కేటీఆర్ చెప్పుకుంటున్నారు.
కానీ తెలంగాణ రాజకీయాలలో రేవంత్ రెడ్డి ఇంత చురుకుగా దూసుకుపోతుంటే, కేసీఆర్ కాదు నేనే మీకు ప్రత్యామ్నాయం. నేనే ముఖ్యమంత్రి అభ్యర్ధిని అని కేటీఆర్ ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితిలో లేరు. నేటికీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకోవడం బలం కాదు అది తమ బలహీనత అని గుర్తించినట్లు లేదు.
నేటికీ కేటీఆర్ తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తుంటే, కవిత ఒంటరిగా చాలా ధైర్యంగా రాజకీయాలు చేస్తున్నారు. ఆమె వలన బీఆర్‌ఎస్ అంతర్గత సమీకరణాలు మారే అవకాశం ఉంటుంది. లేదా ఆమె వలన ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. మరోవైపు బీజేపీ కూడా తెలంగాణపై దృష్టి సారించింది.
ఈ రాజకీయ సమీకరణాలన్నింటినీ చూస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నంత మాత్రాన బీఆర్‌ఎస్ తప్పకుండా గెలుస్తుందని భావించలేము. ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయాలు, సమీకరణాలలో మార్పులు, వాటితో బలాబలాలలో మార్పులు తధ్యం. కనుక అప్పటి పరిస్థితులను బట్టి ఏ పార్టీకి విజయావకశాలున్నాయో అంచనా వేయవచ్చు కానీ ఇప్పటి నుంచే అంచనా వేయడం అంటే అది చిలక జోస్యంతో సమానం.




