కొత్త సంవత్సరంలో బాలీవుడ్ ను ‘ఎ’ సర్టిఫికేట్ సినిమాలు ఏలనున్నాయి. జనవరి 22న “క్యా కూల్ హేన్ హమ్ 3,” 29న “మస్తీజాదే” చిత్రాలు సినీ ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ ను ఆయా చిత్ర నిర్మాతలు ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘అడల్ట్’ కామెడీ కంటెంట్ లో ‘ఒక దానిని మించిన ట్రైలర్ మరొకటి’ అన్న రీతిలో టాక్ తెచ్చుకున్న ఈ రెండు చిత్రాల ధియేటిరికల్ ట్రైలర్స్ ప్రస్తుతం వెబ్ మీడియాను, యూ ట్యూబ్ ను ఒక ఊపు ఊపుతున్నాయి.
డిసెంబర్ 15వ తేదీన విడుదలైన “క్యా కూల్ హేన్ హమ్ 3” ట్రైలర్ ఇప్పటివరకు దాదాపుగా 88 లక్షలకు పైగా యూ ట్యూబ్ క్లిక్స్ ను అందుకుని, ఒక కోటి వైపుకు సాగిపోతోంది. అలాగే, 23వ తేదీన రిలీజ్ అయిన సన్నీలియోన్ “మస్తీజాదే” షుమారుగా 12 లక్షల క్లిక్స్ తో దూసుకుపోతోంది. ఈ క్లిక్స్ ప్రభావంతో బాలీవుడ్ లో ‘అడల్ట్’ కంటెంట్ చిత్రాలకు ఎంత ఆదరణ ఉందనేది స్పష్టమవుతోందని ఈ సందర్భంగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ చిత్రాలకు ఇంతటి ఊపును అందించిన “గ్రాండ్ మస్తీ” చిత్రాన్ని 100 కోట్లతో ఆశీర్వదించిన ప్రేక్షకులు, చూడబోతుంటే… ఈ రెండు చిత్రాలకు చెరో 200 కోట్లతో పట్టం కడతారన్న అంచనాలు ఏర్పడుతున్నాయి. మొత్తానికి కొత్త సంవత్సరం తొలి మాసంలో బాలీవుడ్ కొత్త కొత్త పాఠాలు నేర్చుకోనుందన్న మాట.





