దసరా, దీపావళి వంటి భారీ పండగలు ఒక దాని వెనుక ఒకటి రావడంతో, మేకర్స్ కు తమ సినిమా విడుదల చేసేందుకు ఇంతకు మించి మంచి సమయం దొరకదని భావించి బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేసారు. ప్రతీ ఏడాది లానే, ఈ సంవత్సరం కూడా దసరా,దివాళీ కు సినిమాలు తండోప తండాలుగా విడుదలయ్యాయి.
ముందుగా దసరా విషయానికి వస్తే, సూపర్ స్టార్ రజినీకాంత్ లీడ్ రోల్ లో నటించిన ‘వేట్టైయన్’ కు భారీ అంచనాలు ఏర్పడగా, ‘విశ్వం’ అంటూ వింటేజ్ శ్రీను వైట్ల కామెడీ ట్రాక్ తో వస్తున్నారు అని ఈ సినిమా పై కూడా అంచనాలు బానే ఉన్నాయి. ‘మా నాన్న సూపర్ హీరో’, ‘జనక అయితే గనక’ వంటి చిన్న సినిమాలు విడుదలయ్యాయి. ‘మార్టిన్’,’జిగ్ర’ అంటూ 2 డబ్బింగ్ సినిమాలు కూడా మేము సైతం అంటూ ముందుకొచ్చాయి.
విడుదలైన ప్రతి సినిమా పై మోస్తారు అంచనాలు ఉన్నప్పటికీ, ఒక్క సినిమా కూడా అభిమానులను సంతృప్తి పరచలేక బాక్స్ ఆఫీస్ వద్ద చతికలపడ్డాయి. సూపర్ స్టార్ రజని వెట్టయ్యన్ ఓ మాదిరిగా ఉన్నప్పటికీ, మిగతా సినిమాలు కనీసం బజ్ కూడా సొంతం చెస్కోలేకపోయాయి. ఇలా దసరా సీజన్ మొత్తం సినీ పరిశ్రమకు నిరాశనే మిగిల్చింది.
ఇక ఈసారి దీపావళికి కూడా ఏకంగా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘లక్కీ భాస్కర్’,’క’ వంటి చిత్రాలు నేరుగా తెలుగు సినిమాలు కాగా, ‘అమరన్’,’బఘీర’ లాంటి చిత్రాలను తెలుగు లో కూడా డబ్ చేసారు. ఇందులో, ‘లక్కీ భాస్కర్’ మరియు ‘క’ కు రిలీజ్ కు ముందే ఉన్న టాక్, అంచనాలు సినిమా కు మరింత ప్లస్ గా మారాయి.
‘లక్కీ భాస్కర్’ తో దుల్కర్ సల్మాన్ తెలుగు లో వరుసగా మూడవ హిట్ అందుకున్నారు. అయితే, చాల కాలం నుండి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ‘కిరణ్ అబ్బవరం’ కు సైతం ఈ దీపావళి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. సహజంగానే, యాక్టింగ్ అదరగొట్టే సాయి పల్లవి మరోసారి ఆకట్టుకోవడం, శివ కార్తికేయన్ పెర్ఫామెన్స్ కూడా బావుంటాడం వలన, ఆ సినిమాకు కూడా మంచి టాక్ వచ్చింది.
మరి, దసరా కు బోసిపోయిన థియేటర్లన్నీ ఇప్పుడు దీపావళి పండుగకు టపాసుల మాదిరి మోత మోగిస్తాయి అనటం తప్పేమి కాదు. ఇటీవలే ‘దీపావళి కు దారెటు’ అనే ప్రస్తావన కు నేడు విడుదలయిన సినిమాలు ‘దీపావళికి అన్నీ దారులే’ అన్నట్టు బదులిచ్చాయి. సినిమా బావుంటే ఎన్ని సినిమాలు విడుదలయినప్పటికీ తెలుగు వారు కచ్చితంగా ఆదరిస్తారనే మాట మరోసారి రుజువయ్యింది.
దీనితో దసరాకు ప్రేక్షకులు లేక నిల్ అయినా థియేటర్లు ఈ దీపావళికి మాత్రం హౌస్ ఫుల్ చేస్తున్నారు. చూడాలి, మరి ఈ పాజిటివ్ టాక్ తో లాంగ్ రన్ లో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో అని.




