ఈసారి బందర్ లడ్డూ ఎవరికి దక్కుతుందో?

Machilipatnam-Perni-Kittu-Kollu-Ravindraమచిలీపట్నం రాజకీయాలు, బందర్ లడ్డూ రెండూ చాలా ఫేమస్. రాజకీయాలు గురించి మాట్లాడుకొంటే గత ఎన్నికలలో వైసీపీ తరపున పేర్ని నాని విజయం సాధించి మంత్రి పదవి కూడా పొందారు. కానీ కేబినెట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో అవుట్ అయిపోయి కామెంట్రీ బాక్స్‌లోకి షిఫ్ట్ అయిపోయారు.

తనకు చివరివరకు ఆడేందుకు కెప్టెన్ జగనన్న అవకాశం ఇవ్వలేదనో మరో కారణం చేతనో, వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయనని తనకు బదులు తన కుమారుడు కిట్టూ చేతికి బ్యాట్ ఇచ్చి బరిలో దింపుతానని చెప్పేశారు. కనుక కిట్టూ కూడా అప్పుడే మచిలీపట్నంలో ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు.

ADVERTISEMENT

ఇక మచిలీపట్నం నుంచి టిడిపి అభ్యర్ధిగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. జనసేన కూడా ఈసారి బందర్ లడ్డూ రుచి చూడాలని చాలా ఆశపడుతోంది. బహుశః అందుకే పవన్‌ కళ్యాణ్‌ ఈసారి జనసేన వార్షికోత్సవం మచిలీపట్నంలో అట్టహాసంగా నిర్వహించి ఉండవచ్చు. కనుక జనసేన తరపున పోటీ చేయాలనుకొంటున్న బండి రామకృష్ణ కూడా నియోజకవర్గంలో చురుకుగా పనిచేసుకుపోతున్నారు. ఒకవేళ టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకొంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు పేర్ని కిట్టూ టీమ్‌తో మ్యాచ్ ఆడవలసి ఉంటుంది.

ఈ మ్యాచ్ జరిగే సమయానికి వైసీపీ అధికారంలోనే ఉంటుంది కనుక ఎంపైరింగ్ పేర్ని నానే చేసి కొడుకుని గెలిపించుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తారని వేరే చెప్పక్కరలేదు.

అయితే గత ఎన్నికలలో జగనన్నకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని ప్రజలు అనుకోవడంతో వైసీపీ ప్రభంజనం ఏర్పడింది. కానీ ఈ నాలుగేళ్ళలో ఏపీ ప్రజలు జగనన్న ఆలోచనలు, పాలన, బాదుడు ఏవిదంగా ఉంటాయో రుచి చూసేశారు కనుక ప్రభంజనాలు ఏమీ ఉండకపోవచ్చు.

పైగా అప్పుడే ఏపీలో రాజకీయ వాతావరణంలో చాలా మార్పు కనిపిస్తోంది. ఇంతకాలం టిడిపితో పొత్తులకి అయిష్టత వ్యక్తం చేస్తున్న బిజెపి ఎన్డీయేలోకి రమ్మనమని పిలుస్తోంది. వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేనలు కలిసి పనిచేస్తాయని ఆ పార్టీలు, వాటి నేతలు చెప్పకపోయినా, అవి తప్పక కలిసి పనిచేస్తాయని, వాటి చేతిలో 175 వికెట్ల తేడాతో మ్యాచ్‌ ఓడిపోవడం ఖాయమని వైసీపీ నేతలు గట్టిగా ఆందోళన చెందుతున్నారు.

కనుక వచ్చే ఎన్నికలలో మచిలీపట్నంతో సహా ఆంధ్రప్రదేశ్‌ అంతటా టిడిపి, జనసేన, బిజెపిలు మూడు కలిసి దట్టమైన మేఘాలు ముసురుకొనే అవకాశం కనిపిస్తోంది.

ఈ నేపద్యంలో మచిలీపట్నంలో పేర్ని కిట్టూ వెర్సస్ టిడిపి, జనసేన, బిజెపి టీమ్‌ మద్య జరుగబోయే మ్యాచ్‌లో ఏ టీమ్‌ గెలుస్తుందో, బందర్ లడ్డూ వంటి ఎమ్మెల్యే పదవి ఎవరికి దక్కుతుందో లొట్టలు వేసుకొంటూ ఎదురుచూడాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories