సమస్య ఇళయరాజాది కాదు తీసుకొచ్చిన మనదే

Maestro  Ilaiyaraajaమొన్న శని ఆదివారాలు హైదరాబాద్ లో గ్రాండ్ గా ఇళయరాజా లైవ్ కన్సర్ట్ జరిగింది. అభిమానులు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే వచ్చారు. ఆయనతో తెలుగు సినిమాకున్న అనుబంధం చిన్నది కాదు. 1985తో మొదలుపెట్టి సుమారు పది సంవత్సరాలకు పైగానే టాలీవుడ్ మ్యూజిక్ ని శాసించిన చక్రవర్తి. రాజ్ కోటి, కీరవాణి లాంటి యువ తరంగాలతో పోటీ పడుతూ ఆయన ఇచ్చిన ఆల్బమ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీనే. 95 తర్వాత ఏఆర్ రెహమాన్ ప్రభంజనం వల్ల రాజాగారి హవా తగ్గింది కానీ వేయి సినిమాలకు పైగా పని చేసిన ఇసైజ్ఞాని కాలంలో మనమూ ఉండటం ముమ్మాటికీ ఈ జనరేషన్ చేసుకున్న అదృష్టం.

అలాంటి లెజెండ్ రెండోసారి భాగ్యనగరంలో షో చేశారు. 2017లో మొదటిసారి జరిగిన వేడుక రసాభాసగా ముగిసి ఫ్యాన్స్ కి అసంతృప్తి మిగిల్చింది. నిర్వాహకుల డొల్లతనం వల్ల విఐపి గ్యాలరీతో మొదలుపెట్టి స్టేజి నుంచి చాలా దూరంగా తక్కువ టికెట్ ధర ఉండే రెగ్యులర్ సెక్షన్ దాకా సరైన ఏర్పాట్లు లేక అందరూ కలిసిపోయి కొన్నవాళ్ళు ఎవరో ఉచితంగా వచ్చింది ఎవరో అర్థం కానంత గందరగోళం నెలకొంది. సరే పాటలు బాగుంటే ఇవన్నీ లెక్కలోకి కాదు కానీ ఎస్పి బాలసుబ్రమణ్యంతో ఉన్న వివాదం కారణంగా ఆయన లేకుండా ఈ కన్సర్ట్ జరగడంతో అంతగా సక్సెస్ కాలేదు. హడావిడిగా నడిపించిన వైనం కూడా ఇబ్బంది పెట్టింది.

ADVERTISEMENT

ఈసారి చాలా మటుకు ఇలాంటి లోపాలను కవర్ చేసే ప్రయత్నం గట్టిగానే చేశారు. కానీ గతంలో తప్పులు ఎక్కడ జరిగాయో వాటిని సరిదిద్దే ప్రయత్నం పూర్తిగా జరగలేదు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలకు ప్రాణంగా నిలిచే సౌండ్ సిస్టమ్ శ్రోతల చెవులకు పరీక్ష పెట్టింది. ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాల్సిన వాటిని ఏదైనా హఠాత్తుగా సమస్య తలెత్తితే వెంటనే సరిదిద్దే మెకానిజం ని ముందే ప్లాన్ చేసుకోవాలి. కానీ అది జరగలేదు. బాలు గారు కాలం చేశారు సరే చిత్ర గారు అందుబాటులో ఉన్నారు. కానీ ఆవిడను అడిగారో లేక ఏదోలా మేనేజ్ చేద్దామనుకున్నారో తెలియదు అసలైతే రాలేదు.

మొత్తానికి ఈ సెకండ్ సిరీస్ కొంచెం బెటర్ అనిపించుకుందే తప్ప బెస్ట్ కాలేకపోయింది. చెన్నైలో ఇలాంటి ఎన్నో కన్సర్ట్స్ అద్భుతంగా నిర్వహించిన ట్రాక్ రికార్డు ఇళయరాజాకు ఉంది. ఎండ్రెండ్రుమ్ రాజా ప్రోగ్రాం చేసినప్పుడు స్టేడియం వేలాది జనంతో కిక్కిరిసిపోయి, వందలాది సెలబ్రిటీలు వచ్చినా నాలుగు గంటల పాటు ఆడియన్స్ తన్మయత్వంలో ఉండిపోయారు. అలాంటి ప్రభావం ఇక్కడా కనిపించి ఉండాలి. ముప్పై అయిదు పాటలతో ఆనందంలో ఓలలాడించినా పైన చెప్పిన అసంతృప్తికి కారణం ముమ్మాటికీ రాజాగారు కాదు. మనమే అవుతాము. ఇలాంటివి పదే పదే నిర్వహించే అదృష్టం దక్కదని గుర్తుంచుకుని ఉంటే బాగుండేది.

ADVERTISEMENT
Latest Stories