బాక్సాఫీస్ వద్ద ఈ వారం కూడా ‘భరతుడి’ హవా కొనసాగుతోంది. తొలి వారం రికార్డు వసూళ్ళతో పాటు ఈ వీకెండ్ కూడా కొరటాల – మహేష్ కాంబోల ద్వయం ప్రేక్షకులను ధియేటర్లకు రప్పిస్తోంది. శనివారం నాడు మంచి కలెక్షన్స్ రాబట్టిందని చెప్తోన్న ట్రేడ్ టాక్ తో, ఈ సండే కూడా ప్రేక్షకులతో కళకళలాడనుంది. ఏపీ, తెలంగాణాలలో పరిస్థితి ఇలా ఉంటే, మహేష్ అడ్డాగా కొనియాడే యుఎస్ మార్కెట్ లో 3 మిలియన్స్ మార్క్ ను అందుకోవడం చెప్పుకోదగ్గ విషయం.
ఈ క్లబ్ లో నిలిచిన నాలుగవ సినిమాగా “భరత్ అనే నేను” నిలువగా, ‘బాహుబలి’ రెండు పార్టులు కాకుండా, ‘రంగస్థలం’ 3వ స్థానంలో నిలిచింది. దీనిని దాటలన్నా కూడా మరో హాఫ్ మిలియన్ డాలర్స్ వసూలు చేయాల్సి ఉన్న నేపధ్యంలో… ఇది కాస్త కష్టసాధ్యంగానే కనపడుతోంది. ముఖ్యంగా ‘అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్’ ప్రభావం ఎక్కువగా ఉందని స్వయంగా యుఎస్ పంపిణీదారుడు సక్సెస్ వేడుకల్లో చెప్పడం, ఓవరాల్ గా ‘భరత్ అనే నేను’ను నాలుగవ స్థానంలో నిలబెడుతుందని చెప్పవచ్చు.
ఈ వారంతో దాదాపుగా యుఎస్ లో ‘భరత్ అనే నేను’ హంగామా ముగిసినట్లే భావించవచ్చు. రెండు వారాల్లో 3 మిలియన్ డాలర్స్ అనేది తక్కువేమీ కాదు గానీ, అంచనాలు అంతకుమించి ఉండడం కాస్త నిరుత్సాహాన్ని పంచే విషయం. యుఎస్ డెఫిసిట్ లో కాస్త ఆస్ట్రేలియాలో కవర్ అయ్యింది గనుక, ఓవరాల్ గా పంపిణీదారుడికి అయితే ఎలాంటి నష్టము ఉండబోదు గానీ, మున్ముందు యుఎస్ మార్కెట్ విషయంలో మహేష్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సినిమా చెప్పకనే చెప్పింది.



