ఇచ్చిన మాట మేరకు ప్రిన్స్ మహేష్ బాబు దత్తత తీసుకున్న గ్రామంలో పర్యటించారు. 1999లో విడుదలైన ‘రాజకుమారుడు’ సినిమా తర్వాత ప్రిన్స్ పర్యటన చేయడంతో బుర్రిపాలెంతో సహా చుట్టూప్రక్కల గ్రామాల నుండి జనాలు విశేష సంఖ్యలో తరలివచ్చారు. ప్రజలు చూపించిన అభిమానానికి ఫిదా అయిన ప్రిన్స్, అందరికీ అభివాదాలు చేసి అభిమానులను సంతోష పెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రిన్స్…
‘మా ఊరికి రావడం చాలా సంతోషంగా ఉందని, నాయనమ్మ, నాన్న, బాబాయ్ లు చేసిన అభివృద్ధినే కొనసాగిస్తానని’ హామీ ఇచ్చారు. అయితే అన్నింటి కంటే ముందుగా ఆరోగ్యం, విద్యల పై దృష్టి పెడతానని, ఇందుకు ఆంధ్రా హాస్పిటల్స్ యాజమాన్యం సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని, అలాగే తన నాయనమ్మ కట్టించిన స్కూల్ ను మరింత అభివృద్ధి పధంలో తీసుకువెళ్తానని చెప్పిన ప్రిన్స్…. గ్రామ వాసులకు అసలు సంతోషకరమైన వార్తను అందించారు.
“ఇక నుండి బుర్రిపాలెంకు రెగ్యులర్ గా వస్తూ ఉంటానని” స్వీట్ న్యూస్ అందించాడు ప్రిన్స్. దీంతో మహేష్ ను వీక్షించవచ్చన్న సంతోషంతో పాటు, తమ గ్రామ అభివృద్ధి ఖాయం అంటూ జనాలు చర్చలు ప్రారంభించారు. మహేష్ బాబు చేసే అభివృద్ధితో పాటు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధులతో బుర్రిపాలెంను ఓ మోడల్ విలేజ్ గా మారుస్తామని ఎంపీ జయదేవ్ కూడా చెప్పడంతో… బుర్రిపాలెంకు అన్ని వైపులా అభివృద్ధి ద్వారాలు తెరుచుకున్నట్లయ్యింది. ప్రజల్లో సామజిక చైతన్యంపై కూడా మహేష్ ఎక్కువ దృష్టి పెడతారని తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా ప్రిన్స్ మాటగా చెప్పుకొచ్చారు.





