నందమూరి బాలకృష్ణ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తన తండ్రి జీవిత చరిత్ర ‘ఎన్టీఆర్’ చిత్రంలో కృష్ణ పాత్రకు మహేష్ బాబు తప్ప మరెవరూ సరిపోరని బాలయ్య భావిస్తున్నాడని, ఈ పాత్రను చేయడానికి మహేష్ కూడా అంగీకరించినట్టేనని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర నారా చంద్రబాబునాయుడిగా రానా నటించనున్నాడని సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రకు విద్యాబాలన్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రకు నాగచైతన్యను తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో మోహన్ బాబు, రాజశేఖర్ తదితరులు నటించడం కూడా ఇప్పటికే ఖాయమైంది. ఇక సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో మహేష్ బాబు కనిపించడం అభిమానులను అలరించే అంశమే. ఈ సినిమాలో అన్ని పాత్రలకూ ప్రాధాన్యం ఉన్నందున పేరున్న నటులనే తీసుకోవాలని నిర్ణయించుకున్న బాలయ్య ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. అయితే గతంలో కూడా ఎన్టీఆర్ బయోపిక్ లో మహేష్ బాబు గురించి వార్త రాగా, అదంతా ఒట్టి పుకారేనని తేలిపోయింది. కానీ తాజాగా అదే పుకారు షికారు చేస్తుండడంతో, ఇందులో నిజానిజాల కోసం సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



