మూవీ ఆరిస్ట్ సంఘానికి సొంతంగా ఓ బిల్డింగ్ అంటూ ఉండాలని, అందుకు నిధులు సేకరిస్తోన్న ‘మా’ అసోసియేషన్ ఇటీవల అమెరికాలో మెగాస్టార్ చిరంజీవిని ముఖ్యఅతిధిగా పిలిచి గ్రాండ్ గా సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించింది. దీని ద్వారా దాదాపుగా కోటి రూపాయలు ‘మా’కు సమకూరిందని ఇటీవల శివాజీరాజా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తదుపరిగా మహేష్ బాబు వంతు వచ్చింది.
యుఎస్ లో జరిగే ‘మా’ ఈవెంట్ కు హాజరయ్యేందుకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలో ప్రిన్స్ కున్న క్రేజ్ తెలియనిది కాదు. దీంతో మెగాస్టార్ చిరంజీవి రాబట్టిన నిధులను మించి మహేష్ సమకూరుస్తాడో లేదోనన్నది ఆసక్తికరంగా మారింది. కానీ ఇటీవల బయటపడిన అమెరికా సెక్స్ రాకెట్ రీత్యా, ఎంతమంది సెలబ్రిటీలు యుఎస్ లో జరిగే ఈ ఈవెంట్ లో పాల్గొంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది.
అయితే ఈ వేడుక స్వయంగా ‘మా’ నిర్వహిస్తోంది గనుక, ఏ యాంకర్ కైనా, సెలబ్రిటీలకైనా ఇబ్బందులు ఉండకపోవచ్చనేది ఓ టాక్. ఈ అంశాలపై మరియు ఏ తేదీన నిర్వహిస్తారన్న దానిపై స్పష్థత రావాల్సి ఉండగా, రెండో విడత సిల్వర్ జూబ్లీ వేడుకలను అమెరికాలో ఘనంగా నిర్వహించి, వీలైనంత ఎక్కువ మొత్తాన్ని నిధుల రూపంలో రాబట్టేందుకు ‘మా’ సభ్యుల ఏర్పాట్లు మాత్రం చాలా గట్టిగా సాగుతున్నట్లు తెలుస్తోంది.



