ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. చెన్నైలో 29న లాంచనంగా సెట్స్ పైకి వెళ్లబోతుండగా, ఆగష్టు 1వ తేదీ నుండి మహేష్ బాబు పాల్గొనబోతున్నాడు. ఇదిలా ఉంటే, ఆగష్టు 9వ తేదీన ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు అన్న విషయం సినీ వర్గాలకు తెలిసిందే. ఈ రోజున అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టి, మహేష్ బాబుపై తమ అభిమానాన్ని చాటుకోవడంలో నిమగ్నమవుతారు.
అలాంటి అభిమాన గణం కోసం ఓ సర్ ప్రైజ్ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చిన దర్శకుడు మురుగదాస్, దానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లుగా ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి మహేష్ పోస్టర్ తో ఓ ప్రీ లుక్ ను విడుదల చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా వెల్లడిస్తారో లేక ఎలాంటి ప్రకటన లేకుండా ఆగష్టు 9వ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తారో చూడాలి.
ప్రిన్స్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, తల్లిగా ‘బిచ్చగాడు’ ఫేం దీపా రామానుజం కనపడనున్నారు. అలాగే ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. చెన్నైలో ప్రారంభమైన తొలి షెడ్యూల్ తర్వాత హైదరాబాద్, ముంబై, పూణే, గుజరాత్ వంటి తదితర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోవడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి.



