మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న “స్పైడర్” షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ మొత్తం పూర్తి కానుందని సమాచారం. ఈ నెల 28 నాటికి ‘స్పైడర్’ షూటింగ్ ముగించుకుని, వచ్చే నెలలో కొరటాల శివ సినిమా షూటింగ్ లో పాల్గొనే విధంగా ప్రిన్స్ షెడ్యూల్స్ సిద్ధమయ్యాయని తెలుస్తోంది.
అయితే ‘స్పైడర్’ షూటింగ్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ప్రిన్స్ బైక్ డ్రైవ్ చేస్తున్న ఈ ఫోటోను టాప్ యాంగిల్ నుండి క్లిక్ చేసారు. అంతకు ముందు హల్చల్ చేసిన ఫోటోలలో కూడా ఈ రెడ్ బైక్ పైనే ప్రిన్స్ సందడి చేసాడు. దీంతో ‘స్పైడర్’ సినిమాలో మహేష్ తో పాటు ఈ రెడ్ బైక్ కూడా ఓ కీలక పాత్ర పోషించిందని స్పష్టమవుతోంది.
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 31వ తేదీన “స్పైడర్” టీజర్ విడుదల కానుండగా, ఆగష్టు 11వ తేదీన సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కూడా ‘బాహుబలి’ మాదిరే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుండడంతో, ‘బాహుబలి’ తర్వాత ‘శ్రీమంతుడు’ ఎలా అయితే సక్సెస్ అయ్యిందో, ‘బాహుబలి 2’ తర్వాత ‘స్పైడర్’ అలాగే సక్సెస్ బాట పడుతుందని అంచనా వేస్తున్నారు.



