సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఒక టీజర్ మరియు అంతకుముందు ఫస్ట్ లుక్ పోస్టర్స్ మినహా ఇప్పటివరకు అధికారికంగా “స్పైడర్”కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. మరో పక్కన జూన్ 23వ తేదీ నుండి సినిమాను వాయిదా వేసిన చిత్ర యూనిట్, తదుపరి విడుదల తేదీని కూడా ప్రకటించలేదు. ఇటీవల కాలంలో ఈ సినిమా మళ్ళీ వాయిదా పడనుందని అనేక ఊహాగానాలు చెలరేగుతున్న నేపధ్యంలో… అభిమానుల్లో ఒకింత ఆందోళన నెలకొంది.
అయితే ఈ సందేహలన్నింటిని నివృత్తి చేసే విధంగా “స్పైడర్” నిర్మాణ సంస్థ నుండి ఓ ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. సోమవారం నాడు దీనికి ముహూర్తం పెట్టినట్లుగా సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న “స్పైడర్” విడుదల తేదీని ప్రకటించడంతో పాటు, ధియేటిరికల్ ట్రైలర్ మరియు ఆడియో విడుదల తేదీలను కూడా ప్రకటించే యోచనలో ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాల సమాచారం. అలాగే ఈ నెలలో గానీ, ఆగష్టు 9వ తేదీన గానీ తెలుగు, తమిళ భాషల్లో ఓ టీజర్ ను కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
వీటన్నింటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అధికారికంగా చిత్ర యూనిట్ సోమవారం నాడు తెలియజేయనుంది. దీంతో ఇప్పటివరకు అభిమానుల్లో నెలకొన్న సందేహాలకు జవాబు లభించనుంది. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హరీష్ జయరాజ్ అదిరిపోయే 5 పాటలను అందించినట్లుగా ఇప్పటికే మార్కెట్ వర్గాల్లో హల్చల్ చేస్తున్న టాక్. దీంతో ఈ సినిమా పైనే కాదు, హరీష్ ఆల్బమ్ పైన కూడా అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.



