వన్ లైన్ వండర్స్, పంచ్ డైలాగ్ లకు ప్రిన్స్ కేరాఫ్ అడ్రస్. వెండితెరపైనే కాదు, నిజ జీవితంలో ప్రిన్స్ పేల్చే పంచ్ లకు కొదవలేదని చాలా సందర్భాలలో సినీ ప్రముఖులు బహిరంగంగానే వెల్లడించారు. ఒకటి, రెండు ఆడియో వేడుకలపై ప్రేక్షకులు కూడా దీనిని గమనించారు. బహుశా ఈ పంచ్ లు ప్రిన్స్ సతీమణి నమ్రతకు కూడా అలవాటై పోయాయో ఏమో గానీ, బుర్రిపాలెం విచ్చేసిన సమయంలో “శ్రీమంతుడు” సినిమాలో విలన్ల ముందు ప్రిన్స్ వేసిన పంచ్ డైలాగ్ ను రిపీట్ చేసారు.
‘అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, కాల్వలు, వీధి లైట్ల నిర్మాణమే కాదని’ చెప్పిన నమ్రత.., ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఖచ్చితంగా ఉండాలని, ముందుగా మరుగుదొడ్డి లేని ఇళ్ళకు వాటిని ఏర్పాటు చేసేలా చర్యలు ఉంటాయని, మౌలిక వసతులను ఏర్పాటు చేసిన తర్వాత దశల వారీగా గ్రామాభివృద్ధికి ప్రణాళికలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఈ సారి మహేష్ వస్తే వారితో ఫోటోలు దిగేందుకు ఒక చిన్న కాంటెస్ట్ కూడా ప్రకటించారు నమ్రత.
స్వచ్చ గ్రామం మాదిరి… ఊరులో ఎవరైతే వారి వారి రోడ్లను పరిశుభ్రంగా ఉంచుకుంటారో, వారిని మహేష్ బాబుకు పరిచయం చేసి ఫోటోలు దిగే అవకాశాన్ని కల్పిస్తామని, ఊరులో అందరూ అలాగే ఉన్నా, అందరికీ ఆ అవకాశం దక్కుతుందని అన్నారు. దీని కోసం ఎంపిక చేసిన కమిటీ గ్రామ ప్రజల పనితీరును పరిశీలిస్తుందని చెప్పారు. బుర్రిపాలెంలో ఈ బుల్లెమ్మ పలికిన పలుకులు ఏ మాత్రం ప్రభావితం చూపుతాయో తెలుసుకోవాలంటే మళ్ళీ మహేష్ వెళ్ళే వరకు వెయిట్ చేయాల్సిందే.



